Periyar Jayanti: సనాతన ధర్మాన్ని వీడిన రోజే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని జీడి సారయ్య తెలిపారు. భారత నాస్తిక సమాజం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సామాజిక విప్లవ యోధుడు, పెరియార్ ఇవి రామస్వామి 47వ జయంతి వేడుకలను చేవెళ్ల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీడి సారయ్య జాతీయ అధ్యక్షుడు, భారత నాస్తిక సమాజ బాధ్యులు మాట్లాడుతూ పెరియార్ చేపట్టిన సామాజిక పోరాటాలను వివరించారు. ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజం వరకు హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఆలోచించడం వల్లనే మనిషి ప్రగతి సాధ్యపడిందని, ఈ ప్రగతి పెరియార్ వంటి మహనీయుల పోరాటాల వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు.
మనిషి ఆలోచన జీవన విధానాలు మారాలి
మధ్యయుగ అజ్ఞానంతో ఏర్పడిన దేవుడు, మతం వంటి భావనలు వారసత్వంగా కొనసాగుతున్నా, వాటికి శాస్త్రీయ ఆధారాలు లేవని నొక్కిచెప్పారు. బ్రాహ్మణిజం తమ ప్రయోజనాల కోసం మూఢనమ్మకాలను ప్రజలపై రుద్ది, ఆర్థిక దోపిడీ, సామాజిక వివక్షకు గురిచేసిందని విమర్శించారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా మనిషి ఆలోచన, జీవన విధానాలు మారాలని పిలుపునిచ్చారు. నాస్తికత్వం ప్రాచీన కాలం నుంచే ప్రారంభమై, నేటి సమాజానికి ఆధునీకరణలో హేతువాద దృక్పథం ఎంతో తోడ్పడిందని తెలిపారు.
బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం
మతం, మత విశ్వాసాల నుండి ప్రజలు దూరమైనప్పుడే మూఢవిశ్వాసాల నుండి విముక్తి పొంది దేశం పురోగమిస్తుందని ప్రజలకు పిలుపునిచ్చారు. పెరియార్ ఇవి రామసామి తమిళనాడులో జన్మించి, బాల్య దశ నుంచే హేతువాద దృక్పథాన్ని అలవర్చుకొని, బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేశారు. కులవ్యవస్థ, వర్ణవ్యవస్థ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా స్వాభిమాన ఉద్యమాన్ని నడిపించారు.
1952లో తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్న రాజగోపాలచారి ప్రవేశపెట్టిన విద్యా చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేపట్టి, అందరూ చదువుకునే విధంగా చట్టాన్ని ఎత్తివేసే వరకు పోరాడారు. స్త్రీలపై ఉన్న వివక్షకు మతమే ప్రధాన కారణమని, పురుషాధిక్యాన్ని పెంచిన బ్రాహ్మణీయ మనుధర్మ శాస్త్రంలోని డొల్లతనాన్ని ప్రజలకు వివరణగా చెప్పారు. బాల్య వివాహాలు, సతీసహగమనం వంటి అమానుష పరిస్థితులను ఎదుర్కొనేందుకు మహిళలను చైతన్యవంతులుగా మార్చాలని పిలుపునిచ్చారు.
ప్రతి వ్యక్తికి దేవాలయ ప్రవేశ హక్కు ఉండాలి
దేవదాసి వ్యవస్థ వంటి మూఢ సంప్రదాయాల నిర్మూలనకు డాక్టర్ ముత్తు లక్ష్మారెడ్డి వంటి నాయకులను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. తమిళనాడులో దళితులు, శూద్రులకు గుడిలోకి ప్రవేశానికి ఉన్న నిషేధాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసి, నేడు దేవాలయాల్లో కనీస ప్రవేశానికి మార్గం సుగమం చేసినట్లు గుర్తు చేశారు. దేవుడిని నమ్మని వారు మొక్కకపోయినా, నమ్మే ప్రతి వ్యక్తికి దేవాలయ ప్రవేశ హక్కు ఉండాలని పెరియార్ పేర్కొన్నారని, మతం ప్రజలను అవమానానికి గురిచేస్తే దానిని వీడి స్వేచ్ఛతో జీవించాలన్నారు.
బస్సులు, హోటళ్లు, ప్రజా స్థలాల్లో శూద్రులు, దళితులు, ఇతర వర్గాలు తిరగరాదనే శాసనాలను తన పోరాటంతో ధ్వంసం చేస్తూ, మనిషిని మనిషిగా గౌరవించే సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.
పెరియార్ జీవిత కాలమంతా జైలు జీవితాన్ని భరించి, బ్రాహ్మణ వ్యతిరేక పోరాటాల్లో, బ్రిటిష్ విధానాలను వ్యతిరేకిస్తూ కఠినమైన జైలు శిక్షలను అనుభవించినట్లు తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడిస్తే మాత్రమే మతాల మధ్య యుద్ధాలు, మానవ విధ్వంసం లేకుండా మానవతా సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత నాస్తిక సమాజం రంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఆర్కే నాగని, పిడిఎస్‌యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజేష్, కొజ్జంకి జైపాల్, ప్రకాష్, చంటి, రవి, మహేష్ పాల్గొన్నారు.
Also Read: Alampur Jogulamba Temple: అలంపూర్ ఆలయాల్లో ఆధిపత్యం.. శక్తి పీఠంని సైతం వదలని రాజకీయం