Illegal Government Land: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భూ కబ్జాల పర్వం జోరుగా కొనసాగుతున్నది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు బోర్డు పాతేస్తున్నారు. కోట్ల విలువైన భూమిని కబ్జాదారులు కాజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్(Hayath Nagar) మండలం ఆన్మగల్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 191లో ఎకరం 9 గుంటల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. అధికారుల నిర్లక్ష్యంతోనే స్థలం కబ్జాల పాలైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దర్జాగా కబ్జా
విజయవాడ, నాగర్జునసాగర్ జాతీయ రహదారులను కలిపే ప్రధాన రహదారికి అనుకొని ఉన్న 191 సర్వే నెంబర్‌లోని స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేసి విక్రయాలకు పాల్పడుతున్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో భాగమైన ఇంజాపూర్ రెవెన్యూకు ఆనుకొని హయత్‌నగర్ డివిజన్ ఆన్మగల్ రెవెన్యూలో ఇది చివరి సరిహద్దు ప్రాంతం కావడంతో అధికారుల కండ్లు కప్పి కబ్జాలు చేస్తున్నారు. ఇక్కడ మిథులా అపార్ట్‌మెంట్‌కు మరోవైపు నుంచి రహదారి ఉన్నది. కానీ, సర్వే నెంబర్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ స్థలంలో నుంచి రహదారి నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే ఆ అపార్ట్‌మెంట్‌కు రహదారి సుదూరం కావడంతో దగ్గరయ్యే ప్రభుత్వ స్థలంలో నుంచి వేయడం దారుణం. గతంలో అనేక మార్లు స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు ఆ స్థలాన్ని ప్రజాప్రయోజనాల కోసం జీహెచ్ఎంసీకి అప్పగించారు. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో కోట్ల విలువైన భూమి కబ్జాదారుల పాలవుతున్నది.
Also Read: Coldwave Update: మరో 2-3 రోజులు ఇదే స్థాయిలో తీవ్రమైన చలి.. రిలీఫ్ ఎప్పటినుంచంటే?
మున్సిపాలిటీ సూచిక బోర్డు ఉన్నా కూడా..
ఆన్మగల్ సర్వే నెంబర్ 191లో జీహెచ్ఎంసీ అధికారులు పెట్టిన సూచిక బోర్డును సైతం లెక్క చేయకుండా నిర్మాణం చేస్తున్నారు. వీరి వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి కాజేశారనే ఆరోపణలున్నాయి. కానీ, ప్రభుత్వాలు మారినప్పటికీ కబ్జాలు మాత్రం ఆగడం లేదనే ప్రచారం కొనసాగుతున్నది. కబ్జాదారులు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లకు దగ్గరగా ఉండడం ఆలవాటైందని స్థానికులు అంటున్నారు.
సీపీఐ నేతల వినతి
ప్రభుత్వ భూమిని కాపాడాలని జీహెచ్ఎంసీ(GHMC) జోనల్ కమిషనర్‌కు సీపీఐ(CPI) నేతలు వినతి పత్రం సమర్పించారు. సోమవారం మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, ఎల్బీనగర్ నియోజకవర్గం సామిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఆ భూమిలో కొంతమంది రియల్ ఎస్టేట్(Real estate) బ్రోకర్లు కబ్జా చేసి రోడ్లు వేసి నిర్మాణాలు చేస్తుండగా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు చొరవ చూపి రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.
Also Read: Allu Arjun Fans: సీఎం రేవంత్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు

