Allu Arjun Fans: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అభిమానుల తీరు ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సమయంలో జరిగిన విషాద ఘటన తెలియంది కాదు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Arjun Fans) సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో రోజున జరిగిన తొక్కిసలాట ఘటన ఇప్పుడప్పుడే మరిచిపోయేలా లేదు. అల్లు అర్జున్‌ను చూడటానికి వచ్చిన జనం ఒక్కసారిగా ఎగబడటంతో జరిగిన ఈ దుర్ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ మరికొందరిపై చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం విదితమే.
Also Read- Naa Anveshana: నా అన్వేషణ అన్వేష్‌పై ఫిర్యాదు.. ఇండియాకు వచ్చాడా.. ఇక అంతే!
స్పేస్ చర్చలో అనుచిత వ్యాఖ్యలు
ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితమే పోలీసులు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ పరిణామం అల్లు అర్జున్ అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో, ఈ నెల 27వ తేదీ సాయంత్రం సమయంలో అల్లు అర్జున్ అభిమానులుగా చెప్పుకుంటూ కొంతమంది ‘ఎక్స్’ వేదికగా ఒక ‘స్పేస్’ నిర్వహించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై ఆ స్పేస్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ స్పేస్ చర్చలో పాల్గొన్న కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో హద్దులు దాటి ప్రవర్తించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కించపరిచేలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఒక వ్యక్తి వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఎక్స్ ఖాతా వివరాలను, ఆ స్పేస్‌కు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించారు.
Also Read- Shambhala: ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ‘శంబాల’పై రెబల్ స్టార్!
పోలీసుల యాక్షన్
ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుకు సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిజిటల్ మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయనేది ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. అభిమానం అనేది హద్దుల్లో ఉన్నంత వరకే అందం, కానీ అది చట్ట వ్యతిరేక పనులకు దారితీస్తే శిక్షలు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఓవైపు పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తే, ఆ ఆనందం అల్లు అర్జున్‌కు లేకుండా చేసింది సంధ్య థియేటర్ ఘటన. ఇప్పుడు అభిమానుల అత్యుత్సాహం ఈ వివాదాన్ని ఎంత వరకు తీసుకెళుతుందో అని బన్నీ అభిమానులలో కొందరు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా అయితే ఈ స్పేస్ వివాదం అల్లు అర్జున్ టీమ్‌కు, ఆయన ఫ్యామిలీకి తలనొప్పిగా మారుతుందన్నది మాత్రం వాస్తవాం. అన్నట్టు ఈ స్పేస్ గురించి అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లినా, ఆయన ఏం మాట్లాడలేదనేలా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యమంత్రిపైనే అనుచిత వ్యాఖ్యలు అంటే.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

