Penuballi Land Scam: పెనుబల్లిలో ప్రభుత్వ భూమికి అక్రమ పట్టా
– ఎమ్మార్వోపై తీవ్ర ఆరోపణలు
– ఎమ్మార్వో రూ.40 లక్షల లంచం తీసుకున్నట్లు ప్రచారం
– విచారణ, కఠిన చర్యల డిమాండ్
ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెనుబల్లి మండలంలో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా పట్టా చేయడానికి ప్రయత్నించిన వ్యవహారం ఇప్పుడు పెద్ద కుంభకోణంగా మారింది. పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 71/3, 71/4లలో ఉన్న మొత్తం 3.20 ఎకరాల కుంటల భూమిని ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ భూమిగా గుర్తించి స్వాధీనం చేసుకుంది. 2023లో అప్పటి ఎమ్మార్వో రమాదేవి ఈ భూమిని అక్రమ కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించారు. అప్పట్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూమి సరిహద్దులు నిర్ధారించి, ప్రభుత్వ భూమి సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
భూభారతి పోర్టల్‌లో నమోదుకు..
అయితే చింతగూడెం రెవెన్యూ పరిధిలో గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఖమ్మం–దేవరపల్లి, విజయవాడ–భద్రాచలం జాతీయ రహదారులకు ఆనుకుని ఉండటంతో సుమారు రూ.5.5 కోట్ల విలువ చేసే ఈ భూమిపై అక్రమార్కులు కన్నేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎమ్మార్వో శ్రీనివాస్ యాదవ్ సుమారు రూ.40 లక్షలు ముడుపులుగా తీసుకుని ప్రభుత్వ భూమిని అక్రమ పద్ధతుల్లో పట్టా చేసినట్లు మండలంలో పెద్దఎత్తున ఆరోపణలు వెలువడుతున్నాయి. భూభారతి పోర్టల్‌లో నమోదుకు దరఖాస్తు చేయగా, మొత్తం 3.20 ఎకరాల్లో నుంచి 1.20 ఎకరాల భూమిని శీలం లీలావతి భర్త రామచందర్‌రెడ్డి పేరుపై ఎమ్మార్వో డిజిటల్ సైన్ చేసి హైదరాబాద్ సర్వర్‌కు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం బయటపడటంతో గ్రామస్తులు రికార్డులను పరిశీలించగా, రెవెన్యూ శాఖలోని నిర్వాకం బట్టబయలైనట్లు తెలుస్తోంది.
ఎమ్మార్వో డిజిటల్ సైన్..
సాధారణంగా వీఏఓ విచారణ, ఆర్‌ఐ పంచనామా, సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్ పరిశీలన అనంతరం మాత్రమే తహసీల్దార్ డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కీలక దశలేవీ లేకుండానే నేరుగా ఎమ్మార్వో డిజిటల్ సైన్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఎమ్మార్వో మీడియా ముందుకు వచ్చి “పొరపాటున డిజిటల్ సైన్ జరిగింది… సరిదిద్దుతున్నాం” అని వివరణ ఇవ్వడంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రభుత్వ భూమికి సంబంధించిన డిజిటల్ సంతకం అంత తేలికగా పొరపాటున ఎలా జరుగుతుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: O Andala Rakshasi: నేటితరం ఆడపిల్లలు ఎలా ఉండాలో ‘ఓ అందాల రాక్షసి’ చెబుతుందట!
ప్రజల డిమాండ్..
ఎమ్మార్వో చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ‘పొరపాటు’ అనే వాదనను ముందుకు తెచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసిన ఈ భూమిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అలాగే ఈ అక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిపై, ముఖ్యంగా ఎమ్మార్వోపై కఠిన చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే, ఎమ్మార్వోతో పాటు సహకరించిన రెవెన్యూ ఉద్యోగులు, మధ్యవర్తులు, లబ్ధిదారులపై సెక్షన్ 316, 318, 336, 338, 340లతో పాటు అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act, 1988) లోని సెక్షన్ 7, 13(1)(a), 13(2) కింద కేసులు నమోదు చేసి, 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
ఇక శాఖాపరంగా సంబంధిత అధికారులపై సస్పెన్షన్, డిపార్ట్‌మెంటల్ ఇన్‌క్వైరీ, విధుల నుంచి తొలగింపు (డిస్మిసల్), విజిలెన్స్ & ఏసీబీ విచారణ వంటి కఠిన చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, భూమిని పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవడానికి రెవెన్యూ చట్టాలు, భూ ఆక్రమణ నిరోధక చట్టాల ప్రకారం చర్యలు చేపట్టవచ్చు. ఈ ఘటనపై పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంది వెంకటేశ్వర్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు, చింతగూడెం గ్రామస్తులు కలిసి కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్ కుమార్ యాదవ్‌కు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దరిశెట్టికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపి, చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Thalapathy Vijay: సినిమాలకు గుడ్‌బై.. అధికారికంగా ప్రకటించిన దళపతి విజయ్

