Illegal Constructions: మొయినాబాద్ (Moinabad) మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలను విస్మరించి బహుళ అంతస్తులతో పాటు ఏకంగా కన్వెన్షన్ నిర్మాణాలను చేపడుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జంట జలాశయాల పరిధిలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు 27 ఏళ్ల క్రితం నాటి ప్రభుత్వం జారీ చేసిన 111 జీవో ఇంకా అస్థిత్వంలోనే ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతుండడం విస్మయం గొలుపుతున్నది.
Alos Read: Sandhya Sridhar: సిస్టం.. నా ఇష్టం! నేను చెప్పిందే చేస్తుంది!
నిబంధనలు బేఖాతరు
మొయినాబాద్ (Moinabad) ఇటీవల కొత్తగా మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. 9 గ్రామ పంచాయతీల విలీనంతో మున్సిపాలిటీగా ఆవిర్భవించగా విలీనమైన గ్రామాల్లో అజీజ్ నగర్ (Aziz Nagar) కూడా ఉంది. హియాయత్ సాగర్ నది పరివాహక ప్రాంతం ఎక్కువగా ఈ గ్రామంలోనే ఉంది. ఈ ప్రాంతం మొత్తం 111 జీవో పరిధిలో ఉన్నది. ఎటువంటి పెద్ద నిర్మాణాలు చేపట్ట వద్దని నిబంధనలు ఉన్నప్పటికీ స్థానికులు బేఖాతరు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున చేపడుతున్న నిర్మాణాలు అధికారులకు వరంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారుల కనుసన్నల్లోనే నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతోపాటు నిర్మాణ దారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అజీజ్ నగర్‌లో ఏకంగా 7 ఎకరాల్లో ఒకరు కన్వెన్షన్ నిర్మాణాన్ని చేపడుతుండడం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హిమాయత్ నగర్ (Himayat Nagar) రస్తాలో ఇదివరకు కన్వెన్షన్ నిర్మించిన వ్యక్తే అజీజ్ నగర్‌లోనూ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిసింది. కళ్లెదుటే భారీ నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారులు కళ్లు మూసుకుని వ్యవహరిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లెక్కలు కుదిరాకే.. నిర్మాణాలు
మొయినాబాద్ (Moinabad) మున్సిపాలిటీలో అనుమతులు లేని నిర్మాణాలన్నీ అధికారులకు తెలిసే జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లెక్క కుదిరాక అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగితే నోటీసులు అందజేసి చేతులు దులుపుకుంటున్నారు. నోటీసుల తర్వాత ఎటువంటి చర్యలు ఉండడం లేదు. కొందరు అధికారులు, ప్రజా ప్రతినిధుల అండదండలతోనే ఈ అక్రమ తంతు వ్యవహారం కొనసాగుతున్నదని స్థానికులు పేర్కొంటున్నారు.
Also Read: Garividi Lakshmi: ఫోక్ ఐకాన్ ‘గరివిడి లక్ష్మి’ గ్లింప్స్ చూశారా..!