Illegal Constructions:
మేడ్చల్ స్వేచ్ఛ: రాజకీయ బలం ఉంటే ఏమైనా చేయొచ్చా?. నిబంధనలను తోసిరాజి ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చా?. అధికారులను లెక్క చేయకుండా తమ పని తాము చేసుకోవచ్చు, కానీ, సామాన్యులు చిన్న నిర్మాణం చేస్తే అధికార దర్పం చూపించే అధికారుల తీరు ప్రశ్నార్థమవుతోంది. బడాబాబుల అక్రమ నిర్మాణాల (Illegal Constructions) విషయం మాత్రం పెట్టదన్నట్టు, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 44వ నెంబరు జాతీయ రహదారిని అనుకొని ఉన్న ఎల్లంపేటలో ఈ తంతు జరుగుతోంది. మేడ్చల్ మండలం ఎల్లంపేటలో సర్వే నెంబరులు 70, 71లలో రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాన్ని చేపట్టారు.
ఎల్లంపేట పంచాయతీగా ఉన్నప్పటి నుంచి దాని నిర్మాణానికి బీజం పడింది. అప్పట్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం దిశగా కదిలితే, పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసి, నిర్మాణాన్ని ఆపారు. కానీ, ఆ తర్వాత కొన్ని రోజులకు పంచాయతీగా ఉన్న ఎల్లంపేట మున్సిపాలిటీగా మారింది. మళ్లీ అక్రమార్కులు నిర్మాణాన్ని మొదలు పెట్టారు. హెచ్ఎండీఏ, స్థానికంగా ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాన్ని గుర్తించిన కమిషనర్ నోటీసులు జారీ చేసి నిర్మాణాన్ని ఆపారు. సెలవు దినాల్లో కూడా పనులు జరగకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించి, నిర్మాణాన్ని అడ్డుకున్నారు. కానీ, ఆ కమిషనర్ బదిలీ అనంతరం మళ్లీ నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఈ విషయమై ఆరోపణలు వెల్లువెత్తడంతో కమిషనర్ పనులు ఆపాలని నోటీసులు జారీ చేశారు. పగటి పూట నిర్మాణం చేయకుండా యాజమాన్యం నిర్మాణాన్ని రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా చేస్తోంది. అధికారుల నుంచి నోటీసులు వచ్చినా, స్థానికులు కలెక్టర్ స్థాయిలో ఫిర్యాదు చేసినా నిర్మాణం మాత్రం ఆగడం లేదు. అధికార పార్టీకి చెందిన నేతల అండ ఉన్న కారణంగానే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణం దాదాపు 50 శాతం పైనే పూర్తయింది.
Read Also- Educated Couple Begging: భర్త ఎల్ఎల్‌బీ.. భార్య బీకాం కంప్యూటర్స్.. అయినా భిక్షాటనే మార్గం!
అనుమతులు ఒకలా.. నిర్మాణం మరోలా
ఎల్లంపేట మున్సిపాలిటీలో మరోచోట కూడా అక్రమ నిర్మాణం జరుగుతోంది. అనుమతులు ఒకలా పొంది, మరోలా నిర్మిస్తున్నారు. 44వ జాతీయ రహదారి ఆనుకొని రేకులు నిర్మిస్తున్న భారీ నిర్మాణానికి గృహ నిర్మాణ అనుమతులు పొంది, వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం జోలికి కూడా అధికారులు వెళ్లడం లేదు. అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాల కారణంగా మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతుంది. ఈ విషయమైన స్థానికులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిర్మాణాలు ఆగడం లేదు. అనుమతుల్లేని నిర్మాణాలపై చర్య తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నోటీసులు జారీ చేశాం
70, 71 సర్వే నెంబర్లలో అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలకు నోటీసులు జారీ చేశామని కమిషనర్ స్వామి నాయక్ తెలిపారు అనుమతుల నిలుపుదల చేశామని, నోటీసులు ఇచ్చినా నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారని ప్రశ్నించగా, రాత్రి పూట నిర్మాణాలు చేస్తున్నట్టుగా ఉన్నారని బదులిచ్చారు. అలాగే జాతీయ రహదారి వెంబడి జరుగుతువు నిర్మాణానికి సంబంధించి ప్రశ్నించగా వాణిజ్య నిర్మాణాన్ని చేపట్టినట్టు తను దృష్టికి వచ్చిందని, నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Also- University Recruitment: ఉద్యాన వర్సిటీ ప్రతిష్ట దెబ్బతీస్తే ఉపేక్షించం.. నియామకాలపై కుట్రలెందుకు..?

