Educated Couple Begging: వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో యాచిస్తున్న వృద్ధులకు అధికారుల కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ లో ఓ అరుదైన కుటుంబ కథ అందరిని కలచివేసింది. భర్త ఎల్ఎల్‌బీ (LLB) పూర్తి చేయగా భార్య బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసినప్పటికీ రాజన్న సన్నిధిలో యాచిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంతకీ ఈ భార్య, భర్తలు ఎవరు? వారికి వచ్చిన కష్టమేంటి? ఇప్పుడు చూద్దాం.
వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్ చెందిన జలంధర్ రెడ్డి, శిరీష దంపతులు ఉన్నత విద్యను అభ్యసించారు. జలంధర్ రెడ్డి ఎల్ఎల్‌బీ పూర్తి చేయగా, శిరీష బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ వీరు అధికారుల దృష్టిలో పడ్డారు. మాసిన బట్టలతో ఉండి.. అలవోకగా ఇంగ్లీషు మాట్లాడుతుండటం చూసి కౌన్సిలింగ్ చేసే అధికారులు సైతం ఒక్కసారిగా అవాక్కయ్యారు.
గుడి వద్ద ఎందుకున్నారు?
ఉన్నత చదువులు చదువుకొని గుడి వద్ద భిక్షాటన చేయడానికి గల కారణాలను అధికారులకు జలంధర్ రెడ్డి దంపతులు తెలియజేశారు. తన భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రాజన్న సన్నిధికి వచ్చి ఇక్కడే ఉంటున్నామని భర్త స్పష్టం చేశారు. భార్య, భర్తలు ఒకరినొకరు చంపుకుంటున్న ఈ రోజుల్లో.. అర్ధాంగి ఆరోగ్యం కోసం ఇలా సర్వస్వం వదిలేసి గుడి వద్దనే జీవిస్తుండటాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Nitin Nabin – Modi: నేను బీజేపీ కార్యకర్తను… నాకు బాస్ నితిన్ నబీన్.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజన్నే దిక్కు!
తమలాగా రాజన్న సన్నిధికి ఎంతో మంది వచ్చి ఇక్కడే కాలం గడుపుతున్నారని జలంధర్ రెడ్డి, శిరీష దంపతులు తెలిపారు. ఇంటికాడ కొడుకు కొట్టి, చంపుతాడనే భయంతో వచ్చిన వాళ్లను రాజన్న అండగా నిలుస్తున్నాడని తెలియజేశారు. మరోవైపు అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ ఇంటి నుండి ఏదైనా సమస్య ఉండి బయటకు వచ్చినవారు ఇంటికి వెళ్లేందుకు చట్టపరమైన సహాయం అందిస్తామని తెలిపారు. వృద్ధులను వేధిస్తే సంబంధిత బంధువులపై కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.

