Nitin Nabin – Modi: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ కార్యకర్తనన్న మోదీ.. తనకు నితిన్ నబీన్ బాస్ అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అధిపతి అయినా.. బీజేపీ కార్యకర్త కావడమే తనకు ఎక్కువ గర్వకారణమని మోదీ చెప్పుకొచ్చారు. నితిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాత్రమే కాదన్న ప్రధాని.. ఎన్డీఏ కూటమిని ముందుకు నడిపే సామర్థ్యం కూడా అతడికి ఉందని మోదీ కొనియాడారు.
నబిన్ నిరూపించుకున్నారు: మోదీ
బీజేపీ చీఫ్ గా నితిన్ నబీన్ మంగళవారం అధికారంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పార్టీ అప్పగించిన ప్రతీ బాధ్యతను నితిన్ నబీన్ విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. తనను తాను రుజువు చేసుకున్నారని కొనియాడారు. పార్టీ కంటే దేశమే ముఖ్యమన్న నినాదంతో తాము పనిచేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని కుటుంబ రాజకీయ పార్టీలు.. దేశం ముఖ్యమనే నినాదంతో యువకులకు తలుపులు మూసివేస్తున్నాయని మోదీ అన్నారు. బీజేపీ మాత్రం అన్ని వర్గాల వారి కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు.
‘కాంగ్రెస్ కొంపను అవే ముంచాయ్’
మరోవైపు దేశంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని ప్రధాని మోదీ అన్నారు. బెంగాల్ లో ప్రజల వాయిస్ గా బీజేపీ ముందుకు సాగుతోందని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే కాకుండా నగరపాలక ఎలక్షన్స్ లోనూ బీజేపీ విజయాలు సాధిస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే కేరళలోనూ తమ పార్టీ పుంజుకుందని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా కేవలం 3 కోట్ల మంది ఇంటికి మాత్రమే నీరు అందేవని మోదీ గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరికి మంచి నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల బాధను అర్ధం చేసుకొని జలజీవన్ మిషన్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చామి.. దీని ద్వారా దేశంలోని 35 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధోగతికి ఆ పార్టీ విధానాలే కారణమని మోదీ ఆరోపించారు. కుటుంబ రాజకీయాలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లక్షణాలు బీజేపీకి అంటకుండా జాగ్రత్త పడాల్సిన అవసరముందని మోదీ చెప్పుకొచ్చారు.
Also Read: Viveka Murder Case: వివేకా కేసులో సంచలనం.. సుప్రీం కోర్టు కీలక ప్రశ్నలు.. దర్యాప్తు ఓ కొలిక్కిరాబోతుందా?
ఎవరీ నితిన్ నబిన్?
బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబిన్ విషయానికి వస్తే ఆయన 1980 మే 23న ఝార్ఖండ్ లోని రాంచీలో జన్మించారు. చిన్నవయసులోని రాజకీయాల్లోకి ప్రవేశించి.. పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2010 నుండి బంకిపూర్ అసెంబ్లీ నుంచి నబిన్ వరుసగా ఎంపికవుతు వస్తున్నారు. 2010, 2015, 2020, 2025లో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటారు. అలాగే బిహార్ కేబినేట్ లో రోడ్డు, పట్టాణాభివృద్ధి మంత్రిగా తన మార్క్ చూపించారు. నబిన్ ప్రతిభను గుర్తించిన బీజేపీ అదిష్టానం.. సిక్కిం, చత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించింది. అక్కడ నబిన్ రచించిన రాజకీయ వ్యూహాలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. ఫలితంగా ప్రధాని మోదీ, అమిత్ షా మన్ననలను నబిన్ పొందారు. ఈ నేపథ్యంలో తాజాగా అతి చిన్న వయసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు సైతం చేపట్టారు.

