Viveka Murder Case: ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి (వివేక) హత్య కేసు.. ఇప్పటికీ ఓ పజిల్ లా మిగిలిపోయింది. 2019 మార్చి 15న పులివెందులలోని నివాసంలో వివేక దారుణ హత్యకు గురయ్యారు. 2020 జులై 9న దీనిపై సీబీఐ దర్యాప్తు మెుదలుకాగా.. ఇప్పటివరకూ దోషులు ఎవరో తేలలేదు. తన తండ్రి మరణానికి కారమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ వివేక కూతురు సునీత రెడ్డి గత కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వివేక కేసు మరోమారు సుప్రీంకోర్టు చెంతకు చేరగా.. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకెంతకాలం కేసును కొనసాగిస్తారంటూ సీబీఐ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మళ్లీ మినీ ట్రయలా?
వివేకా కేసులో సీబీఐ దర్యాప్తును మరింత కొనసాగించేందుకు ఇటీవల ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతి ఇచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త్వరితగతిన కేసును క్లోజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం సీబీఐకు కీలక ప్రశ్నలు సంధించింది. ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలని ప్రశ్నించింది. మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇలా అయితే సీబీఐ దర్యాప్తు పూర్తి కావడానికి మరో పదేళ్లు పడుతుందని మండిపడింది.
‘కేసు క్లోజ్ చేయండి’
వివేకా కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేకుంటే కేసును క్లోజ్ చేయాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సూచించింది. ఈ కేసును లాజికల్ ఎండ్ కు తీసుకెళ్లాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. సీబీఐ వైఖరిని బట్టే ఈ కేసులో తాము నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం.. తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తే దానికి ఇంకెంత సమయం కావాలని ప్రశ్నించింది. సునీత దాఖలు చేసిన పిటిషన్ పై తమ వైఖరి ఏంటో తెలియజేయాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి దర్యాప్తుకు అనుమతిస్తే బెయిల్ పై దాని ప్రభావం ఎలా ఉండనుంది వంటి అంశాలను తాము బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ మేరకు ఆదేశాలను సవరిస్తామని తెలిపింది. అయితే తమ వైఖరి తెలిపేందుకు సీబీఐ తరపున న్యాయవాది కొంత సమయం కోరడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు ధర్మాసనం వాయిదా వేసింది.
Also Read: NTR – Bharat Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న.. ఇంకా ఎంతకాలమీ సాగదీత.. ఈ ప్రశ్నలకు సమాధానాలెక్కడ?
కేసు కొలిక్కివచ్చినట్లేనా?
వివేక హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సమగ్ర దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. పలు చార్జిషీటులను కోర్టుకు సమర్పించింది. అందులో ఎర్ర గంగిరెడ్డి (A1), జి. ఉమాశంకర్ రెడ్డి (A2), సునీల్ యాదవ్ (A3),షేక్ దస్తగిరి (A4, విచారణ సమయంలో అప్రూవర్‌గా మారారు), దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి (A5), గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి (A6), వైఎస్ భాస్కర్ రెడ్డి (A7), వైఎస్ అవినాష్ రెడ్డి (A8) పేర్లను నిందితులుగా చేర్చింది. అయితే వివేక హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటివరకూ ఈ అంశం రాజకీయంగా ఏదోక సమయంలో చర్చకు తావిస్తూనే ఉంది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య వివేక కేసు నిత్యం రగులుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణ అవసరం లేకుంటే కేసును క్లోజ్ చేయాలని ఆదేశించడం.. ఈ కేసులో కీలక పరిణామంగా చెప్పవచ్చు. సుప్రీంకోర్టు తదుపరి విచారణలో.. సీబీఐ ఎలాంటి వివరణ ఇస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది. సుప్రీంకోర్టు చెప్పినట్లు ఒకవేళ తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ భావిస్తే.. గతకొన్నేళ్లుగా నానుతూ వస్తున్న వివేకా కేసు.. ఓ కొలిక్కి వచ్చినట్లేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

