Yadadri Bhuvanagiri: కూటికి దూరమై, కాటికి దగ్గరౌతున్న పండుటాకులైన వయోవృద్ధులకు న్యాయం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు(Hanumanth Rao)ను సీనియర్ సిటిజన్స్ చేతులెత్తి వేడుకుంటున్నారు. సోమవారం రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన మల్లెబోయిన మీనమ్మ(Malleboyina Meenamma), నడవలెని స్థితిలో కలెక్టరేట్ కు వచ్చి కలెక్టర్ సార్‌ను న్యాయం చేయాలని వేడుకుంది. మీనమ్మ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరినీ పెంచి పెద్ద చేసింది. తన భర్త మల్లెబోయిన లచ్చయ్య మరణం తరువాత కష్టాలు ప్రారంభం అయ్యాయి. తాను, తన భర్త కష్టపడి సంపాదించిన భూమిని సర్వే నంబర్ 331 లోని భూమిని తన కుమారులిద్దరూ సమంగా పంచుకొని, వారి భార్యల పేర్ల మీదకు మార్చుకున్నారు.
మా అమ్మతో సంబంధం లేదు
మీనమ్మ తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమి సర్వ నెంబర్ 251 లోని భూమిని, తనకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్పి సంతకం చేయించుకొని వేరే వారికి అమ్ముకున్నారు. దీంతో భూమిని కోల్పోయిన మీనమ్మ ను నిర్లక్ష్యం చేయడంతో చిన్న కూతురు కత్తుల యాక లక్ష్మీ(yakalaxmi) వద్దనే గత కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది. ఇటీవల మీనమ్మ ఆరోగ్య పరిస్థితి బాగ లేకపోవడంతో పెద్ద మనుషులు కొడుకులను పిలిపించి అడగ్గా, మా అమ్మతో సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మీనమ్మ గత నెల ఆరున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ను కలువగా చౌటుప్పల్ ఆర్డీవో దగ్గరకు పంపించాడని మీనమ్మ చెబుతుంది. ఆర్డీఓ విచారణా చేసి మీనమ్మ పోషణకు, వైద్య ఖర్చుల నిమిత్తం వయోవృద్ధులు సంరక్షణ చట్టం -2007 ప్రకారం కొడుకులు మీనమ్మ కు పోషణకు వైద్య ఖర్చులకు గానూ కొంత నగదును ఇవ్వాలని ఆదేశించారు.
Also Read: Ramchander Rao: శాసన సభలో నిద్రపోతారా? ఎమ్మెల్యేల తీరుపై రాంచందర్ రావు ఫైర్!
ప్రజావాణిలో కలెక్టర్‌కు..
కానీ కొడుకులిద్దరూ ఆర్డీవో ఆదేశాలు బేఖాతరు చేసారు. దీంతో ఆర్డీవో రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేయాలని లేఖ రాశారు. మీనమ్మ రామన్నపేట పోలీసులను కలువగా, వారు కేసు నమోదు చేయడం లేదని, జిల్లా కలెక్టర్ ను కలవాలని చెప్పడంతో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు వచ్చిన మీనమ్మ తన గోడును కలెక్టర్‌కు చెప్పుకొని విలపించింది. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఎడమ కాలు వేలుని తీసి వేయాలని డాక్టర్లు చెప్పారని, తన పోషణకు వైద్య ఖర్చులకు చాలా ఇబ్బందిగా ఉందని తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకుంది. తన కుమారులైన మల్లె బోయిన లింగయ్య, కోడలు మల్లె బోయిన ముత్తమ్మ, మనుమలు మల్లె బోయిన లక్ష్మణ్, మల్లె బోయిన హేమేంద్ర, మల్లె బోయిన గణేష్ లపై చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్‌ను కోరారు.
Also Read: Purushaha: రాంగ్ బటన్ ప్రెస్ చేశాడు.. రిజల్ట్ చూశారా!

