Narmul Mother Dairy: నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయసహకార సమాఖ్య లిమిటెడ్ (నార్ముల్ మదర్ డెయిరీ) వేలాది మంది పాడి రైతులకు జీవనోపాధి కల్పిస్తోంది. కానీ, ఆ సంస్థ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో సంస్థను నడపడం ఛైర్మన్లకు భారంగా మారింది. తాజాగా బాధ్యతలు చేపట్టిన కొత్త ఛైర్మన్ మందడి ప్రభాకర్ రెడ్డి కూడా రెండు వారాలకే తప్పుకోవడం సంచలనంగా మారింది. సంస్థ అవసరాల కోసం ఏకంగా రైతుల షేర్ క్యాపిటల్‌ను సైతం వాడేయడం గమనార్హం.
సంక్షోభంలో ‘నార్ముల్’..
డెయిరీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రస్తుతం సంస్థకు సుమారు రూ. 70 కోట్ల అప్పులు ఉన్నట్లు సమాచారం. సుమారు 50 వేల మంది పాడి రైతులు, 400 మంది ఉద్యోగులతో నిత్యం లక్ష లీటర్ల పాల సేకరణ జరిపే ఈ డెయిరీలో, గత పదేళ్లలోనే సుమారు రూ. 35.15 కోట్ల నష్టం వాటిల్లిందని పాలక వర్గ సభ్యులే చెబుతున్నారు. రైతుల షేర్ క్యాపిటల్ రూ. 12 కోట్లు ఉండగా, ఆ మొత్తాన్ని కూడా అంతర్గత అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు రైతులకు చెల్లించాల్సిన రూ. 24 కోట్ల పాల బిల్లులు గత మూడు నెలలుగా పెండింగ్‌లోనే ఉండటంతో పాడి రైతులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
Also Read: Tarun Bhascker: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ చూశారా?.. ఎటకారాలు ఓకే ప్రతీకారాలే?
తప్పుడు నివేదికలతో మోసం
డెయిరీకి చెందిన విలువైన భూములను గత పాలకులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం ఇప్పుడు సంస్థకు గుదిబండగా మారింది. ఈ రుణాలకు నెలకు సుమారు రూ. 8 నుంచి 10 లక్షల వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. అంటే ఏడాదికి సుమారు రూ. 10 కోట్ల వరకు కేవలం వడ్డీలకే ఖర్చు చేయాల్సి వస్తోంది. గత 15 ఏళ్లుగా లాభాల్లో లేకపోయినప్పటికీ, వార్షిక నివేదికల్లో మాత్రం లాభాల్లో ఉన్నట్లు చూపించి మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా తప్పుడు నివేదికలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు సమాచారం. దీనివల్ల డెయిరీపై బ్యాంకుల్లో బ్లాక్ లిస్ట్ నమోదైంది. ప్రస్తుతం కొత్తగా రుణాలు ఇచ్చేందుకు ఏ బ్యాంకు ముందుకు రావడం లేదు.
నడుపలేక ఛైర్మన్ల రాజీనామాలు
డెయిరీని తిరిగి లాభాల్లోకి తీసుకురావాలంటే ‘ఢిల్లీ మదర్ డెయిరీ’ దీన్ని టేకోవర్ చేయడం ఒక్కటే మార్గమని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బ్యాంకు నుంచి వాడుకున్న ఓడీ నిధులు రూ. 30 కోట్లకు చేరాయి. అప్పులు చెల్లించకపోతే అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేస్తామని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ రెడ్డి తర్వాత, జనవరి 8న మందడి ప్రభాకర్ రెడ్డి ఛైర్మన్‌గా పగ్గాలు చేపట్టారు. కానీ, గాడిలో పెట్టే మార్గాలు లేక, పెండింగ్ బిల్లుల విషయంలో తలెత్తిన విభేదాలతో శుక్రవారం ఆయన రాజీనామా చేశారు. మరోవైపు, డెయిరీకి చిట్యాల, మిర్యాలగూడ, హయత్ నగర్ వంటి కీలక ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూములను విక్రయిస్తే తప్ప అప్పులు తీరే పరిస్థితి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ భూములను పాడి రైతుల డబ్బుతోనే కొనుగోలు చేసినందున, వాటిని విక్రయించడంపై రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Temple Tourism: టెంపుల్ టూరిజంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్.. ఒకేసారి 30 ఆలయాల సందర్శన..?

