Temple Tourism: టెంపుల్ టూరిజంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అన్ని ప్రధాన ఆలయాలను సులభంగా దర్శించుకునేలా ప్రత్యేక కార్యాచరణను దేవాదాయశాఖ రూపొందించింది. దైవదర్శనం కోసం వచ్చే భక్తులు ఒక గుడినే దర్శించుకుని వెనుతిరగకుండా ఆ ప్రాంతంలోని ప్రముఖ ఆలయాలన్నింటినీ ఒకేసారి సందర్శించేలా ‘టెంపుల్ టూరిజం’ పేరుతో సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. మూడు సర్క్యూట్‌లను ఏర్పాటు చేసింది. ఈ సర్క్యూట్లలో 30 ఆలయాలను పొందుపర్చారు. జోగులాంబ నుంచి బాసర, యాదాద్రి నుంచి భద్రాద్రి, ఉమ్మడి కరీంనగర్ నుంచి మెదక్ ఇలా ప్లాన్‌ను రెడీ చేశారు. దీంతో ఆలయాలకు భక్తులు పెరగనున్నారు.
ఖర్చు ఆదా అయ్యేలా రూట్ మ్యాప్
రాష్ట్రంలోని చారిత్రక, పౌరాణిక, వాస్తుశిల్ప ప్రాముఖ్యత కలిగిన ఆలయాలను అనుసంధానిస్తూ సర్క్యూట్‌లను దేవాదాయశాఖ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా జోగులాంబ, యాదాద్రి, వేములవాడ మూడు సర్క్యూట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. టెంపుల్ టూరిజంలో భాగంగా ప్రతి సర్క్యూట్‌లో 5 నుంచి 10 ప్రముఖ ఆలయాలను దర్శించుకోవడంతోపాటు భక్తుల సమయం, ఖర్చు ఆదా అయ్యేలా రూట్ మ్యాప్ తయారు చేశారు. దీంతో భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరగడంతో ఆలయాలకు ఆదాయం సమకూరనున్నది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మూడేళ్లలో 42 కోట్ల ఆదాయం ఆలయాలకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 2023 – 24లో 286 కోట్లు ఉండగా, 2025 – 26లో 328 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
సర్క్యూట్ 1లో..
రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ టూరిజంలో భాగంగా రూపొందించిన మూడు సర్క్యూట్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలను జోగులాంబ సర్క్యూట్ 1లో చేర్చారు. అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం మొదలుకొని తిరుపతిని తలపించే క్షేత్రాలు ఇందులో ఉన్నాయి. గద్వాల జిల్లాలోని అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం, పాలమూరు తిరుపతిగా పిలిచే మన్యంకొండలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, నల్లమల అటవీ ప్రాంతాలో ఉన్న మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం, పేదల తిరుపతిగా పిలిచే కురుమూర్తిలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం, కొల్లాపూర్‌లోని మాధవ స్వామిని ఆరాధించిన ప్రాంతం, వనపర్తిలోని సంస్థానాలు, అమ్మపల్లిలోని సీతారామచంద్ర స్వామి ఆలయం, వికారాబాద్ జిల్లా అనంతగిరి అనంత పద్మనాభ స్వామి ఆలయాలను కలుపుతూ ఈ సర్క్యూట్‌ను రూపొందించారు.
Also Read: Realme Neo 8 Mobile: రియల్‌మీ నుంచి పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవడం పక్కా!
సర్క్యూట్ 2లో..
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న యాదగిరిగుట్ట నుంచి మొదలుకొని చారిత్రక వరంగల్ మీదుగా గోదావరి తీరంలోని భద్రాచలం వరకు ఈ సర్క్యూట్‌గా చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, నల్గొండ జిల్లా పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి, మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, వాడపల్లి శివాలయం, మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, వరంగల్ భద్రకాళి ఆలయం, రామప్పలోని యునెస్కో వారసత్వ కట్టడం, కాకతీయ శిల్పకళ ఉట్టేపడే రామలింగేశ్వర స్వామి దేవస్థానం, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కురవి వీరభద్ర స్వామి దేవస్థానం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన సీతారామ చంద్ర స్వామి దేవస్థానాన్ని పొందుపర్చారు.
సర్క్యూట్ 3లో..
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని మహిమాన్విత ఆలయాలను ఈ సర్క్యూట్‌లో చేర్చారు. గోదావరి నదీ తీర క్షేత్రాలు, పురాతన శైవ, వైష్ణవ క్షేత్రాలను అనుసంధానించారు. చదువుల తల్లి బాసరను కలుపుతూ ఈ యాత్ర సాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణకాశీగా పిలిచే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి, గోదావరి తీరంలోని ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, కాళేశ్వరంలోని త్రివేణి సంగమం కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం, సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానం, మెదక్ జిల్లాలోని మంజీరా నది పాయల మధ్య ఉన్న ఏడుపాయల ఆలయం (వనదుర్గా భవానీ), నాచారంగుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామి, దేశంలోని ప్రసిద్ధ సరస్వతి ఆలయాల్లో ఒకటైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి ఆలయం, జగిత్యాలలోని కోటిలింగాల స్వామి దేవస్థానాలను ఈ సర్క్యూట్‌లో లింక్ చేశారు.
అంచనాల రూపకల్పనలో అధికారులు
ఈ మూడు సర్క్యూట్‌లను అభివృద్ధి చేస్తే ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను సైతం అధికారులు సిద్ధం చేస్తున్నారు. విడతల వారీగా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సర్క్యూట్ 1కు సంబంధించిన వివరాలకు త్వరలోనే గ్రిన్ సిగ్నల్ రానున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ దేవాదాయశాఖ రూపొందించిన టెంపుల్ టూరిజంతో భక్తుల సంఖ్య పెరగడంతోపాటు శాఖకు ఆదాయం సైతం పెరిగే అవకాశం ఉన్నది.
Also Read: Sama Ram Mohan Reddy: సిట్ ముందుకు కేటీఆర్.. బయట జరిగే డ్రామాలు.. సీన్స్ వారీగా కాంగ్రెస్ రివీల్!

