Mrutyunjaya Yagna: బర్దిపూర్‌లో వైభవోపేతంగా మృత్యుంజయ యజ్ఞం
ఇటీవల భారీగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు
తగ్గిపోవాలంటూ ప్రత్యేక పూజలు
హాజరైన జహీరాబాద్ ఆర్డీవో, భక్తులు
జహీరాబాద్, స్వేచ్ఛ: విశ్వంలోని సమస్త ప్రాణకోటికి మృత్యుభయం తొలగి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తక్షేత్రంలో మృత్యుంజయ (Mrutyunjaya Yagna) లక్షజప యజ్ఞం నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నివారణ కావాలని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, గోపూజ, రుద్రాభిషేకం అనంతరం యజ్ఞాన్ని వైదిక మంత్రాలతో శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఉదయం యజ్ఞవాటికలో వేదోక్తంగా యజ్ఞ క్రతువును ప్రారంభించారు. వేదమంత్రాలు, సన్నాయి మేళాల మధ్య శాస్త్రోక్తంగా లక్షజప యజ్ఞానికి పూర్ణాహుతి చేశారు. మధ్యాహ్నం మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు దర్శన అవకాశాన్ని కల్పించారు.
Read Also- CM Revanth Reddy: బంద్ పేరుతో బెదిరింపులు.. ప్రైవేటు కాలేజీలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
విశ్వ మానవ ధర్మ ఆధ్వర్యంలో లోకకళ్యాణం కోసం ప్రతి నెలా ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి దేవుజా హాజరై పూర్ణాహుతి చేశారు. వారికి ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి సిద్ధేశ్వరానందగిరి పూలమాలలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఝరాసంగం తహసీల్దార్ తిరుమలరావు, శివశక్తి జాతీయ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ కుమార్, శివశక్తి జిల్లా అధ్యక్షుడు ఠాకూర్ శివకుమార్, జిల్లా సమన్వయకర్త ఎం.పి. శ్యాంరావు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు యజ్ఞంలో పాల్గొన్నారు.
Read Also- Cancer Awareness: పిల్లల్లో వచ్చే క్యాన్సర్ పెద్దల దానికంటే ఎందుకు భిన్నంగా ఉంటుందో తెలుసా?
