Cancer Awareness: ఈ మధ్య అన్ని వయసులవారిలోనూ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పెద్దవారిలాగే పిల్లల్లో కూడా క్యాన్సర్ కేసులు ఎక్కువవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, నిపుణులు చెబుతున్నట్లు పిల్లల్లో వచ్చే క్యాన్సర్ పెద్దవారిలో వచ్చే క్యాన్సర్ కంటే పూర్తిగా భిన్నమైనది. పిల్లల శరీరం ఇంకా ఎదుగుదల దశలో ఉంటుంది, కాబట్టి వారికి ఇచ్చే చికిత్సకు ప్రతిస్పందన కూడా పెద్దవారికి కంటే వేరుగా ఉంటుంది. ఈ తేడాలను అర్థం చేసుకోవడం తల్లిదండ్రులకు పిల్లల పరిస్థితిని మెరుగ్గా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఆన్‌కో-లైఫ్ క్యాన్సర్ సెంటర్‌లోని డాక్టర్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్, పెద్దల్లో వచ్చే క్యాన్సర్ మధ్య తేడాలను వివరించారు.
పిల్లల్లో క్యాన్సర్ కారణాలు
చాలా సందర్భాల్లో అసలు ఇది ఎందుకు వస్తుందో కారణం కూడా తెలియదు. కానీ, ఇది సాధారణంగా జన్యు మార్పులు లేదా వారసత్వ సంబంధిత కారణాల వల్ల జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులు వైద్యుడిని సంప్రదించి క్యాన్సర్‌పై అన్ని సందేహాలను అడగాలి.
పెద్దల్లో క్యాన్సర్ కారణాలు
పెద్దవారిలో క్యాన్సర్ రావడానికి జీవనశైలి, పర్యావరణ కారకాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. పొగతాగడం, మద్యం సేవించడం, ఊబకాయం, పోషకాహారం లోపించడం, రసాయనాల ప్రభావం వంటి అంశాలు పెద్దల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
లక్షణాలు
పిల్లల్లో.. జ్వరం, తరచుగా ఇన్ఫెక్షన్లు, వింత ముడతలు లేదా గడ్డలు, అలసట, ఆకస్మిక బరువు తగ్గడం, ఎముకల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త అవసరం.
పెద్దల్లో.. మూత్రపు అలవాట్లలో మార్పులు, దీర్ఘకాలిక దగ్గు, తెలియని రక్తస్రావం, ఎక్కువ కాలం అలసట వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
చికిత్సలో తేడాలు ఇవే..
పిల్లలకి కీమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్స, లేదా బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి చికిత్సలు ఇస్తారు. పిల్లల శరీరం త్వరగా కోలుకునే సామర్థ్యంతో ఉండడం వల్ల పెద్దవారికంటే కీమోథెరపీని బాగా తట్టుకుంటారు.
పెద్దవారికి చికిత్స క్యాన్సర్ రకం, దశ ఆధారంగా ఉంటుంది. రికవరీ సమయం 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు పడవచ్చు.
పిల్లలలో రికవరీ ఎక్కువగా
పిల్లల క్యాన్సర్‌లు సాధారణంగా చికిత్సకు బాగా స్పందిస్తాయి. అందుకే పిల్లల్లో రికవరీ రేటు పెద్దవారికంటే ఎక్కువగా ఉంటుంది.
తగిన సమయానికి నిర్ధారణ, సరైన చికిత్స, వైద్యుల పర్యవేక్షణతో పిల్లలూ, పెద్దలూ ఇద్దరూ ఆరోగ్యంగా జీవించగలరు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
