Water Crisis: బోర్లు, మిషన్ భగీరధ పధకాలు గొంతు తడపని దారుణ పరిస్థితి ఇంకా గిరిజన ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. గిరిజన మహిళలకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు. గుక్కెడు మంచినీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. బోర్ల వద్ద క్యూ కట్టే పాత రోజులు ఇంకా ఈ తరంలో కనిపిస్తున్నాయి. నీటి కోసం మహిళల తోపులాటలు, జగడాలు సర్వసాధారణమైంది.
ఎంపి నిధులతో ఒక నూతన బోరు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం సజ్జరావుపేట తండాలో నీటి కష్టాలు అధికమయ్యాయి. సజ్జరావుపేట తండాలో 1200 మంది జనాభా కలిగి ఉంది. తాగునిటీ సరఫరాకు ఒక బావి కూడా లేదు. కేవలం రెండు ప్రభుత్వ బోర్లతోనే తండా మొత్తం నీటి సరఫరా అవుతోంది. బోర్లలో నీటి మట్టం తగ్గడం మూలంగా నీటి సమస్య మరింత జటిలమైంది. ఎంపి నిధులతో ఒక నూతన బోరు వేశారు. కానీ,మోటార్ బిగించలేదు. ఇదిలా ఉండగా మిషన్ భగీరద లైన్ ఉన్నా వారం, పది రోజులకు ఒకసారి నీటిని వదులుతుండటంతో నీరు సరిపోవడం లేదని తండా వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Fake IAS officer: వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ డాక్టర్ గుట్టురట్టు!
కార్యదర్శి పట్టించుకోవడం లేదు
నీటి కోసం నిత్యం మహిళలు పొట్లాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తండా పురుషులు పేర్కొంటున్నారు. నీటి సరఫరా అయ్యే సమయంలో క్యూ కట్టాల్సి వస్తోందన్ని వాపోతున్నారు. ఖాళీ కడవలతో నిరసనకు దిగారు. గ్రామ కార్యదర్శి పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అదనంగా బోరు వేసి, ఉన్న బోరుకు మోటార్ బిగించి, భగీరధ నీటిని సకాలంలో వదిలితే సమస్య పరిష్కారం అవుతుందని తండావాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ కార్యదర్శి విధులు సక్రమంగా నిర్వర్టించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మురికి కాలువల నిర్వహణ, వీధి దీపాలు వెలిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాండవాసులు ఎంపిడిఓకు వినతి పత్రం కూడా సమర్పించి అందులో వారు పడుతున్న నీటి పాట్లను వివరించారు. కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసారు. ఇక అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.
Also Raed: Fake iPhone Spare Parts: కోటి రూపాయల.. ఐఫోన్ నకిలీ విడిభాగాలు సీజ్!