Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలుస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) పార్టీ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండగా బిజెపి ఉనికి కోసం పాట్లు పడుతోంది. జిల్లాలోని 460 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 4వేలకుపైగా వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతలుగా జరిగే ఎన్నికలకు ఆయా పార్టీలు ఉదృత ప్రచారం చేపట్టాయి. దీంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది.
కాంగ్రెస్ హవా…!
సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తుంది జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంఎల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలు ఉండటం కాంగ్రెస్ పార్టీకి సానుకూలాంశం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి బలంగా మారాయి. 500 రూపాయలకే సిలిండర్ ఉచిత విద్యుత్ రైతు రుణమాఫీ రైతు భరోసా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇలాంటి పథకాలతో లబ్ధి పొందుతున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు ఆసక్తి చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి.
విశేష స్పందన
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్(Congres) కావడంతో ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అన్న భావన ఓటర్లలో కనిపిస్తోంది తొలి,రెండో విడతలో నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ నెల 11, 14వ తేదీల్లో, 17న అచ్చంపేట నియోజకవర్గ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచార పర్వం ప్రారంభమైంది. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచార యాత్రకు ఓటర్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఆయన ప్రచారానికి తరలివస్తున్నారు. నియోజకవర్గంలో గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయన ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి మరింత ముందుకు వెళుతుందని ఆయన వివరిస్తున్న తీరు ఓటర్లలను ఆకట్టుకుంటుంది.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అర్బన్ పార్క్ దుప్పుల వేట కేసులో లొంగిపోయిన నిందితుడు
పట్టుకోసం బీఆర్ఎస్, ఉనికి కోసం బీజేపీ పాట్లు..!
జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉండగా ప్రతిపక్ష బిఆర్ఎస్(BRS) పార్టీ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి(MLA Rajesh Reddy), ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలంగా మారారు. పలు గ్రామపంచాయతీలను ఏకగ్రీవం చేయించారు. పార్టీలో రెబల్స్ లేకుండా చాలామందిని పోటీ నుంచి విరమింపజేయగలిగారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో ఓటు చీలకుండా మద్దతుదారుల గెలుపు సులభంగా మారే పరిస్థితులు కల్పించారు. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కొన్ని గ్రామపంచాయతీలను ఏకగ్రీవం చేయించగా మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. నియోజకవర్గంలో 150 గ్రామపంచాయతీలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి 90 శాతం వరకు సర్పంచ్ స్థానాల్లో విజయం దక్కుతుందని అధికార పార్టీ చేసిన ఓ సర్వేలో తేలింది. దీంతో బీఆర్ఎస్ లో ఆందోళన నెలకొనగా బలమైన పోటీ ఇచ్చేందుకు ఆయన శ్రమిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి లోటుగా..
కొల్లాపూర్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తనదైన వ్యూహాలతో అభ్యర్థుల ఎంపిక నుంచి ఓటింగ్ జరిగే వరకు తన అనుచరుల ద్వారా ప్రణాళికను అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కొంత స్థానికంగా లేకపోవడం కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి లోటుగా మారింది. కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డి గ్రామస్థాయి నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండటం బిఆర్ఎస్ పార్టీ బలహీనపడటం కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా మారింది. ఇక అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని పరిస్థితులు ఉన్నాయి. వంశీకృష్ణ నాయకత్వానికి ప్రజలు ఓటర్లు జై కొడుతున్నారు.
కమలం పార్టీ ఉనికి కనిపించడం లేదు
బీఆర్ఎస్ పార్టీ నుంచి గువ్వల బాలరాజు(bala raju) బీజేపీకి వెళ్లడంతో ఇన్చార్జిగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల అచ్చంపేట బీఆర్ఎస్ కేడర్లో ఉత్తేజం కల్పించలేకపోతున్నాయి. నాగర్‌కర్నూల్ కేంద్రంగా అచ్చంపేట ఎన్నికలను పర్యవేక్షిస్తున్నడంతో బిఆర్ఎస్ అభ్యర్థులను నిరుత్సాహ పరుస్తున్నాయి. ఇక నాలుగు నియోజకవర్గాలోనూ కమలం పార్టీ ఉనికి కనిపించడం లేదు. పదిశాతం స్థానాల్లో కూడా బిజెపి గెలుస్తుందన్న పరిస్థితులు కనిపించడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో భారీ ఓటును సాధించిన బిజెపికి సర్పంచ్ ఎన్నికల్లో ఉనికి కరువైంది. జిల్లా, నియోజకవర్గ నాయకులు సైతం ప్రచారంలో ఎక్కువగా కనిపించడం లేదు. మొత్తం మీద సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎన్నికలతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల ప్రచార యాత్రలు, సర్పంచ్, వార్డు సభ్యుల ఇంటింటి ప్రచారంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Also Read: Medchal Black Magic: మేడ్చల్‌లో క్షుద్ర పూజలు కలకలం!

