SP Srinivasa Rao: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు(SP Srinivasa Rao) సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన శాబాద్ తాండ, సిఎం తాండ, ఎల్లుపేట్, ఎల్పుగొండ, కమ్మరి కత్త, సూరంపల్లి,కొత్తపల్లి, అబ్లపూర్,అన్నారం గ్రామాలకు చెందిన ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకుండా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు.
కఠిన చర్యలు
ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో గొడవలకు కారణమైన వారిని ఇప్పటికే బైండోవర్ చేయడం జరిగిందని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరిగి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్‌లను మూసి వేయించామని, ఏవరైనా అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో నగదు, మద్యం, ఇతర ఉచిత పంపిణీలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.
సోషల్ మీడియాలో విద్వేషాలు
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టి మద్యం, నగదు లేదా ఉచితాలు పంపిణీ చేయరాదని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించి, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉందని ఎస్పీ హెచ్చరించారు. యువత అనవసర గొడవలకు వెళ్లి కేసుల్లో ఇరుక్కోకూడదని, ఒక కేసు నమోదైనా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావని సూచించారు. ఓటు వేసేటప్పుడు ప్రతి ఓటరు క్యూ లైన్‌ను కచ్చితంగా పాటించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ డియస్‌పీ ప్రసన్న కుమార్, అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి, ఎస్‌బీ ఇన్సె్పక్టర్ సందీప్ రెడ్డి, మెదక్ రూరల్ సీఐ జార్జ్, పాపన్నపేట ఎసై శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Stray Dog Attack: దారుణం.. ఓ మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి!

