Teachers Initiative:
కొత్తగూడెం, స్వేచ్ఛ: ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవడం లేదనో, లేదంటే పెళ్లి చేసుకున్న తర్వాత అదనపు కట్నం కావాలని వేధించడంతోనో, లేదంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కాకపోవడంతోనో నిరసనకు దిగడం చూస్తుంటాం. వ్యక్తుల ఇళ్లు, లేదా ఆఫీసుల ముందు బైఠాయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా, చక్కటి సదుద్దేశంతో ఓ వినూత్న నిరసన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District ) దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామంలో (Teachers Initiative) ఈ నిరసన జరిగింది.
నిమ్మలగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గత వారం రోజులుగా స్కూలుకు హాజరుకాలేదు. అందుకు కారణాలు ఏంటో తెలియకపోవడం, సమాచారం లేకపోవడంతో ఉపాధ్యాయులు స్పందించాడు. పిల్లాడిని ఎందుకు స్కూలుకు పంపడం లేదో పరిశీలించేందుకు ఉపాధ్యాయులు బాలుడి ఇంటికి వెళ్లారు. దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో నిస్సహాయులుగా మారిన ఉపాధ్యాయులు చక్కటి ఆలోచన చేశారు.
పలుమార్లు అడిగినా కారణం చెప్పకపోవడంతో అసహనంతో బాలుడి ఇంటిముందు ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరసనకు దిగారు. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల సమక్షంలో నిరసన తెలపడంతో చివరకు తల్లిదండ్రులు స్పందించారు. సోమవారం నుంచి తమ బిడ్డను స్కూలుకు పంపిస్తామని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఈ నిరసన గ్రామంలో చర్చనీయాంశమైంది. పిల్లల విద్యపై తల్లిదండ్రులు చూపించాల్సిన బాధ్యత ఎంత ముఖ్యమైనదో స్థానికులకు మరోసారి గుర్తు చేసినట్లు అయింది. బాధ్యతగా పిల్లాడిని స్కూలుకు పంపించాల్సిన తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించడంతో మేల్కొన్న ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేసి, వారు అనుకున్నట్లుగానే విద్యార్థిని స్కూలుకు రప్పించేందుకు ప్రయత్నాలు ఫలించాయి. ఈ విషయంలో ఉపాధ్యాయులకు అభినందనలు దక్కుతున్నాయి.
Read Also- CM Revanth Reddy: ప్లేయర్ వర్సెస్ పొలిటీషియన్.. కొత్త స్టైల్‌లో దూసుకుపోతున్న సీఎం రేవంత్

