Tamil Nadu: తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న అరిణ్గర్ అన్నా మోడల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చోటుచేసుకున్న ఘోర విషాధకర ఘటన ఒక కుటుంబాన్ని కన్నీరులో ముంచేసింది. సీనియర్లు–జూనియర్ల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న 12వ తరగతి విద్యార్థి, మూడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఆగ్రహంతో రగిలిపోతోంది.
ఈ ఘటన డిసెంబర్ 4న స్కూల్ ప్రాంగణంలో జరిగింది. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పదకొండో తరగతి విద్యార్థులైన పద్నాలుగు మంది బాలురు కలిసి పై తరగతి విద్యార్థిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘర్షణలో ఒక కఠినమైన చెక్క కర్రతో అతని తలకు తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
స్కూల్ సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు విద్యార్థిని కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి థంజావూర్ ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి మెదడులో ఏర్పడ్డ రక్తగడ్డను తొలగించినప్పటికీ, బాలుడి పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు మూడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన అతను ఆదివారం ఉదయం 2.30 గంటల సమయంలో కన్నుమూశాడు.
ఈ దారుణ ఘటన తరువాత పోలీసులు వేగంగా స్పందించి ఆ దాడిలో ఆరోపణలు ఉన్న 14 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మైనర్లు కావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుచేసి, అనంతరం వారిని బాలసంరక్షణ కేంద్రానికి తరలించారు. మొదట ‘మర్డర్ ప్రయత్నం’ కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్ట్‌మార్టం అనంతరం దానిని ‘హత్య’గా మార్చనున్నట్లు వెల్లడించారు.
దాడి జరిగిన క్షణానికి ముందు ఏం జరిగింది?
విద్యార్థుల మధ్య పాత విభేదాలేమైనా ఉన్నాయా? పర్యవేక్షణ ఎందుకు సరిగా జరగలేదు? అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో స్థానికులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ కూడా క్రిమినల్ విచారణతో పాటు విస్తృతమైన దర్యాప్తుకు సిద్ధమవుతోంది. విద్యార్థుల మధ్య పెరుగుతున్న హింసపై మళ్లీ ఆందోళనలు గట్టిగా వినిపిస్తున్నాయి.

