ఆశ్వాపురం స్వేచ్ఛ: Rakshasa Caves: దట్టమైన అడవి చుట్టూ గుట్టలు వాటి మధ్యలో సమాధులు, సొరంగాలు ఎటుచూసినా రాళ్ళు నేలపై పరుచుకొని ఉన్న రంపాల్లాంటి చిత్రమైన బండలు వింతైన ఆకృతులు అపురూప దృశ్యాలు భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులపాడు గ్రామ పంచాయితీ పరిధిలో వేములూరు ప్రాంతంలోని మారుమూల ఏజెన్సీ గుట్టలో దర్శనమిస్తోన్న అద్భుత దృశ్యాలివి. రాకాసి బండలు రాక్షస గుహలుగా పిలవబడే అప్పటి ఆనవాళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రాచీన శిలాయుగానికి చెందిన అనేక పనిముట్లు, ఆనవాళ్ళు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఆదిమానవుల ఆవాసమే ఈ గుట్టలుగా చరిత్రకారులు భావిస్తున్నారు. సుమారు ఎనిమిది అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఈ సమాధులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో సమాధులు ఉండటం విశేషం. చుట్టూ బండలను పేర్చి, పైన కూడా ఎంతో బందోబస్తుగా ఎవరు తెరవకుండా పెద్ద పెద్ద రాళ్లు అప్పట్లో అమర్చబడి ఉన్నాయి. అంతే కాక ఇక్కడ కొన్ని వింత ఆకారాలతో కూడిన రాళ్లు, వస్తువులు కనిపిస్తాయి.
ఆదిమానవులు ఈ ప్రాంతంలో సంచరించి ఉంటారని ఈ ప్రాంతవాసుల నమ్మకం. నాలుగేళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ అధికారులు సందర్శించి ఇవి ఆదిమానవుల ఆనవాళ్లు అని నిర్ధారించారు. ఇక్కడి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం తోగు అనే గుట్టపై గుహలు ఉన్నాయి వాటిలో ఆది మానవులు నివసించే ఉన్నారనే ప్రచారం ఉంది.
Also Read: Khammam district: మీరు ఇలాంటి ఫైనాన్స్ తీసుకున్నారా.. ఐతే మీకు ఇబ్బందులే!
ఈ పురాతన సమాధుల్లో నిధులు ఉంటాయనే అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ సమాధులను తవ్వి వాటిపైన ఉంచిన బండలను తీసేసి పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఈ సమాధుల పైన రాళ్లను తొలగించి నిధుల కోసం అన్వేషిస్తున్నారు. అయితే పురావస్తు శాఖ అధికారులు ఈ గుహలు, సమాధులపై మరింత లోతుగా పరిశోధన చేస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి ఇటువంటి ఆనవాళ్లను భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
స్వరాష్ట్ర పాలనలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఇటువంటి చరిత్ర ఆనవాళ్లపై ప్రభుత్వం దృష్టి సారించి రహదారి మార్గాలు కల్పించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం వల్ల గిరిజన ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందడం తో పాటు అభివృద్ధికి నోచుకుంటాయని స్థానిక ప్రజలు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Damodar Raja Narasimha: అడుగడుగునా అక్రమాలు.. సూపరిండెంట్ పై మంత్రి ఫైర్!