Sathupalli Medical Shops: ప్రజలకు జీవనరేఖగా నిలవాల్సిన ఔషధ దుకాణాలు సత్తుపల్లిలో లాభాల పిండిమిల్లలుగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. పట్టణంలోని మెడికల్ షాపులన్నీ ఓ అనధికార ‘సిండికేట్’ గుప్పిట్లో నడుస్తున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సత్తుపల్లి పాతసెంటర్ కేంద్రంగా ఓ ప్రముఖ మెడికల్ షాపు నిర్వాహకుడు ఈ మొత్తం వ్యవస్థకు అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు వ్యాపార వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏ షాపు యజమాని ఏ ఏజెన్సీకి వెళ్లాలి, ఎవరు ఎంత స్టాక్ తెచ్చుకోవాలి అన్న అంశాలన్నీ సదరు ‘ప్రభావశీలుడి’ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని సమాచారం. షాపులు స్వతంత్ర వ్యాపారాలుగా కాకుండా, ఒకరి ఆధిపత్యం కింద ‘క్యాంప్’లా మారిపోయాయని వినికిడి.
అధికారులకు ‘మామూళ్ల’ రూపంలో..
సత్తుపల్లిలో ఈ మెడికల్ సిండికేట్ దందా పక్కా ప్రణాళికతో సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి మెడికల్ షాపు నుంచి ఏడాదికి ఒక నిర్దిష్ట మొత్తం వసూలు చేస్తున్నారని, మందుల సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా కమీషన్లు తీసుకుంటున్నారని సమాచారం. ఇలా పోగుచేసిన లక్షల రూపాయల సొమ్మును సంబంధిత శాఖల అధికారులకు ‘మామూళ్ల’ రూపంలో ముట్టజెబుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏడాది పొడవునా తనిఖీలు ఉండవు, ఒకవేళ వచ్చినా అవి నామమాత్రమే అన్న ధీమా వ్యాపారుల్లో పాతుకుపోయిందని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమాలు రాజ్యమేలుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ విక్రయం, కాలం చెల్లిన మందుల రీసైక్లింగ్ అనుమానాలు, ఫార్మసిస్ట్ అర్హత లేని వ్యక్తుల చేతుల్లో మందుల పంపిణీ, ఎంఆర్‌పీ కంటే అధిక ధరలు వసూలు చేయడం, బిల్లు అడిగితే దురుసు ప్రవర్తన వంటి అంశాలు షరామామూలుగా మారిపోయాయని వాపోతున్నారు.
Also Read: Komatireddy Venkat Reddy: కేసీఆర్ ముందు నీ బిడ్డ లెక్కకు సమాధానం చెప్పు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మౌనం వెనుక ఆంతర్యం..?
ఈ పరిస్థితుల్లో నిజాయితీగా వ్యాపారం చేయాలనుకునే చిన్న మెడికల్ షాపుల నిర్వాహకులు సైతం ఈ సిండికేట్ ఒత్తిడికి తలొగ్గక తప్పని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తి కనుసన్నల్లో ఈ దందా సాగుతున్నా జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఇప్పటికీ స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కళ్లెదుటే జరుగుతున్న అక్రమాలపై అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు సామాన్య ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. తక్షణమే విజిలెన్స్ అధికారులు స్పందించి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సత్తుపల్లిలో అమ్ముతున్నది నిజంగా మందులేనా? లేక ‘మేనేజ్‌మెంట్’ పేరుతో ప్రజల ప్రాణాలతో బేరసారాలా? అన్నది తేలాల్సి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో “ప్రాణాలకే ప్రిస్క్రిప్షన్ అవసరం వస్తుందేమో” అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: MLC Kavitha: గిరిజన తండాలో బస.. చెంచులతో మమేకమైన ఎమ్మెల్సీ కవిత

