Komatireddy Venkat Reddy: మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల పేరిట అప్పుల కుప్పగా మార్చి అందినంత దోచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లెక్కలను అడుగుతానని సిద్ధమైన కేసీఆర్(KCR) ఇప్పుడు ముందు నీ బిడ్డ అడుగుతున్న లెక్కలకు అదేవిధంగా కాళేశ్వరం అవినీతిపై సమాధానం చెప్పాలని మా లెక్కలు మేము చూసుకుంటామని రాష్ట్ర ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలో పర్యటించారు. ముందుగా గోలిగూడ, సుంకిశాల మీదుగా భువనగిరి, చిట్యాల, కాటేపల్లి వరకు రూ. 50 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. అనంతరం వలిగొండలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను సన్మానించారు.
పార్టీ ఆవిర్భావ సభ
యాదాద్రి భువనగిరి, నల్గొండ లో పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. నాగార్జున కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు కాంగ్రెస్ పార్టీ యువచైతన్య ర్యాలీకి వెళ్లారు. మాడుగుల పల్లి మండల పరిధిలో కొత్తగా నిర్మించిన కేజీబీవీ భవనాన్ని ప్రారంభించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, ఇతర నేతల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రాన్ని కాంక్షించి సాధించి దేశాన్ని అభివృద్ధి చేసిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు నేటి రాజకీయ వ్యవస్థకు మార్గదర్శకాలన్నారు. దేశ ప్రజల స్వతంత్ర కాంక్షను నెరవేర్చేందుకు ఎన్నో పోరాటాలను చేసిందన్నారు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలను కోల్పోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఎన్నో చేసిందని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు.
Also Read: Huma Qureshi as Elizabeth: యష్ ‘టాక్సిక్’ సామ్రాజ్యంలో ‘ఎలిజబెత్’గా హుమా ఖురేషి.. పోస్టర్ పీక్స్..
తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసింది కాంగ్రెస్!
తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల కలను సాకారం చేసిందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎక్కువ కాలం మనగడలో ఉండవని కొద్ది కాలానికే ముక్కలు అవుతాయన్నారు. కెసిఆర్ నెలకు లక్షల వేతనం తీసుకొని ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. అధికారం ఉన్నన్ని రోజులు ప్రజాధనం దోచేందుకు ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కు చక్కర్లు కొట్టిన కేసీఆర్ అధికారం పోగానే ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నే కేసీఆర్ లెక్కలను తేల్చేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఇలా ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తదితరులు ఉన్నారు.
Also Read: KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి.. నాగర్‌కర్నూల్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

