Indira Cooperative Dairy scheme: మధిర నియోజకవర్గానికి ఇందిర కోపరేటివ్ డెయిరీ ప్రతిష్టాత్మక పథకం. ఈ పథకం కింద కీలకమైన గేదెల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధి ర నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరా డెయిరీ, చెరువులు- పర్యాటక రంగం పనుల అభివృద్ధిపై విస్తృతస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరా కో-ఆపరేటివ్ డెయిరీ ప్రాజెక్టులో గేదెల కొనుగోలు అనేది కీలకమైన అంశమని, ఈ వ్యవహారం అంతా కూడా అదనపు కలెక్టర్ స్థాయి అధికారి తో పాటు డీ ఆర్ డీ ఏ, పీఓ పర్యవేక్షణలో జరగాలని ఆదేశించారు.
కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి పొరపాట్లు జరిగిన సంబంధిత అధికారిదే బాధ్యత అని స్పష్టం చేశారు. గేదెలు ఎక్కడ, ఏవి కొనుగోలు చేయాలి అనేది లబ్ధిదారుల నిర్ణయానికి వదిలివేయాలని ఆదేశించారు. 20 వేల మంది లబ్ధిదారులు, 40 వేల గేదెలతో డెయిరీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో గేదెలకు అవసరమైన గడ్డి పెంపకం, అవసరమైన స్థలం పైన సమీక్ష చేశారు. గేదెలు కొనుగోలు చేసే సమయంలో ఇన్సూరెన్స్ చేయించాలని అధికారులకు సూచించారు.
గ్రామాల్లో సమావేశాలు నిర్వహించేటప్పుడు అందరినీ ఆహ్వానించాలని, అదనపు ఆదాయం సృష్టించడం, గేదెల సంరక్షణ, పాల సేకరణ, మార్కెటింగ్ తదితర అంశాల అన్నిటి పైన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. పాల వ్యాపారంలో లబ్ధిదారులకు అవగాహన కలిగించేందుకు ముల్కనూరు, విజయ వంటి డెయిరీ ల సందర్శనకు దశలవారీగా తీసుకువెళ్లాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. డెయిరీ నిర్వహణకు సంబంధించిన పూర్తిస్థాయి కార్యాలయం, సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.
Also read: Retro Trailer: అందమైన, అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తారు.. ట్రైలర్ అదిరింది
సలహాదారును వెంటనే నియమించాలని కోరారు. డెయిరీ కమిటీ సభ్యులు కనీసంగా వారానికి ఒకసారి సమావేశాలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లల్లో గేదెల సంరక్షణకు షెడ్ల నిర్మాణం, పచ్చి, ఎండు గడ్డి లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా సరఫరా చేసేందుకు అవసరమైన ఏర్పాట్ల పైన సమీక్షించారు. గేదెలకు నిరంతరం ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించేందుకు ప్రతి మండలానికి రెండు పశు వైద్య అంబులెన్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వివరించారు.
చెరువులు – పర్యాటక అభివృద్ధికి వెంటనే టెండర్లు పిలవండి
మధిర, జమలాపురం చెరువులను టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం నీటిపారుదల, పర్యటక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ చెరువుల పరిధిలో టూరిజం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న కాటేజీలు, బోట్స్, మినీ హాల్స్ కు సంబంధించిన డిజైన్లను డిప్యూటీ సీఎం పరిశీలించారు.వీటితోపాటు మాటూరు, బయ్యారం, కలకోట, చిరుమర్రి, ముత్తారం, చింతకాని చెరువులు,- పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రగతిపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు.