Khammam Police: పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషితో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు నియంత్రణలో వున్నాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక 2025 ను పోలీస్ కమిషనర్ వెల్లడించారు. సమర్థవంతమైన పోలీసింగ్‌తో ఈ ఏడాది దోపిడీలు, ఇంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్, హత్యలు, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే చోరీ సొత్తు రికవరీ 9 శాతం, నేరాలను ఛేదించడం 11 శాతం పెరిగిందన్నారు. సైబర్ నెరగాళ్లు దోచుకున్న సుమారు 4.5 కోట్ల నగదును భాదితుల అకౌంట్లలోకి తిరిగి జమా అయ్యేలా చేయడంతో పాటు మరో 1.5 కోట్ల రూపాయలు హోల్డ్ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. లోక్ ఆధాలాత్ ద్వారా 36,709 కేసుల పరిస్కారం లభించిందన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణ
ప్రాసిక్యూషన్ అధికారులు, పోలీసుల సమన్వయంతో దోషులకు శిక్ష శాతం పెరిగిందన్నారు. ఈ ఏడాది జరిగిన 928 రోడ్డు ప్రమాదాలలో 332 మంది మృతి చెందారని, మరో 809 మంది గాయపడ్డారని తెలిపారు. గంజాయి సేవించే వారిపైన కేసులు నమోదు చేయడంతో గంజాయి సరఫరా కట్టడి చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నేరాల నియంత్రణకు విజుబుల్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, నేరాలు జరిగే చోటుకు ఉన్నతాధికారులు పరిశీలనకు వెళ్లడం ద్వారా వాటి పరిష్కారంతో పాటు నేరాల కట్టడికి చర్యలు చేపట్టామన్నారు.
Also Read: Home Remedies: కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే, ఈ సహజ చిట్కాలతో చెక్ పెట్టేయండి!
ప్రజల భాగస్వామ్యం ముఖ్యం
పోలీస్ పెట్రోలింగ్, ఆకస్మిక వాహనాల తనిఖీ, కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం, ప్రధాన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో అధికారులు, సిబ్బందికి శిక్షణ నిప్పించడం ద్వారా ఫింగర్ ప్రింట్స్, ఇతర ఆధారాల సేకరణ ద్వారా చోరీ సొత్తును రికవరీ చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు. చోరీ కేసుల్లో నిందితులను త్వరగా గుర్తించడం, వారి కదలికలపై నిఘా పెట్టడం, జైలు నుంచి విడుదలైన నేరస్థులపై నిఘా వేయడం ద్వారా ఘటనలను కట్టడి చేశామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా బ్లాక్ స్పాట్ గా గుర్తించిన ప్రదేశాల్లో లోపాలను సరిదిద్ది సిగ్నల్ లైట్లు, బారికేడ్ల వినియోగం, రేడియం స్టిక్కర్లతో సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేశారు. విద్యా సంస్థల్లో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీలు ప్రసాద్ రావు, రామానుజం, ఏసీపీలు వసుంధర యాదవ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, మహేష్, సర్వర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
Also Read: MLC Kavitha: గిరిజన తండాలో బస.. చెంచులతో మమేకమైన ఎమ్మెల్సీ కవిత

