CM Revanth Reddy: అయ్యా.. సంపన్నులకే పరిమితమైన సన్నబియ్యాన్ని మాలాంటి పేదలకు అందించారు. మీకు ప్రత్యేక అభినందనలు అంటూ ఆ కుటుంబం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తమ ఇంటికి రావడంతో ఆ నిరుపేద కుటుంబం ఆనందానికి అవధులు లేవు. చివరగా తనకు ప్రేమానురాగాలతో అన్నం వడ్డించిన ఆ ఆడబిడ్డ కుటుంబానికి శ్రీరామనవమి పర్వదినం రోజు చీరసారె సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అరుదైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఆదివారం జరిగింది.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాచలం శ్రీ రాములవారి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సన్న బియ్యం లబ్ధిదారుడు ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు.
కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి రావడంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం ఏర్పడింది. శ్రీరామనవమి పర్వదినం రోజు తమ ఇంటికి సీఎం రావడంతో ఆ కుటుంబ ఆనందాలకు అవధుల్లేవు. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి మంగళ హారతి తో స్వాగతం పలికారు వారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ మేరకు లబ్ధి చెందాయో ఆ కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
Also Read: Sri Rama Navami 2025: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు..
ప్రధానంగా సంపన్న కుటుంబాలకే పరిమితమైన సన్నబియ్యాన్ని తమలాంటి పేదవారికి సైతం సీఎం చేరువ చేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, చీరను అందజేశారు. ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షాన ఉంటుందని, ఇది ఇందిరమ్మ రాజ్యం తోనే సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పర్యటనలో సిఎస్ శాంతి కుమారి పలువురు ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు.