KTR on CM Revanth: రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని మిట్టపల్లిలో ఏర్పాటుచేసిన రాయల శేషగిరిరావు విగ్రహ ఆవిష్కరణకు హాజరైన కేటీఆర్ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణను ఉద్యమం చేసి సాధించుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని, గత పదేళ్ల కాలంలో ప్రజలకు ఎక్కడా కూడా ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా పాలించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్దే అన్నారు.
ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కెసిఆర్ చిలక్కి చెప్పినట్టు చెప్పారని గుర్తు చేశారు. అందరూ ఓటేశారు కదా… మార్పు బాగుందా..? మార్పు కావాలనే జిల్లా మొత్తం కాంగ్రెస్కు ఓటేశారు కదా ఇప్పుడు ఎలా ఉంది..? అంటూ ప్రజలను అడిగారు. వాళ్లు చెప్పిన ఏ హామీ అయినా నెరవేర్చారా…? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను నమ్మి మంచి మంచి నాయకులను ఓడగొట్టారు. ఇప్పుడు మంచి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందా అంటూ క్వశ్చన్ చేశారు. పదేళ్ల పాలన చేసిన కేసీఆర్ను కాదని కాంగ్రెస్ విసిరిన ఆనందమైన వలలో చిక్కుకున్నారని గుర్తు చేశారు.
6 గ్యారంటీలు కాకుండా 420 హామీలను సైతం ప్రజలకు ఇచ్చి మోసగించారని విమర్శించారు. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను.. కానీ ఎవరూ కూడా రేవంత్ రెడ్డి లాంటి దివాలా కోరు మాటలు మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారంటున్నా రేవంత్… దొంగనా దొంగల లాగే చూస్తారు కదా అని చురకలు వేశారు. ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు అన్నారు. అపాయింట్మెంట్ ఇస్తే చెప్పులు సైతం ఎత్తుకుపోతాడని తానే చెప్పుకోవడం ఆయన పలుకుబడికి అద్దం పడుతుందన్నారు.
జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారని తెలుస్తోంది. గ్రామస్థాయి నుండి మొదలుపెడితే జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల్లో ఉండేలా ప్రణాళిక రచించుకోవాలని సూచించారు. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ సత్తా ఏంటో చాటాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ లేదు, షాది ముబారక్ లేదు.. కళ్యాణ లక్ష్మీ లేదు. చివరికి రైతుబంధు ఇచ్చే బిఆర్ఎస్ ను ఓడ గొట్టి రైతులకు రైతు భరోసాను సైతం ఎగ్గొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ చేసిన ప్రతి పథకానికి తూట్లు పెట్టారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పథకాలను అమలు చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు జరగడం లేదు.. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు… ఏం లాభం అభివృద్ధి లేదు.. సంక్షేమం లేదని ఆక్షేపించారు. 17 నెలలు జిల్లాకు ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలని గుర్తు చేశారు. కెసిఆర్ ప్రజల కోసం సీతారామ ప్రాజెక్టు తెస్తే ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నారే తప్ప.. రైతులకు చేసిందేమీ లేదని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి ఆపిడవిట్, నోట్ లు అబద్ధపు హామీలన్నీ ఇచ్చి నేడు ప్రజలను మోసగిస్తున్నాడని విమర్శించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు