TG Janasena Incharge: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీసీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఘాటుగా స్పందించారు. సారీ చెప్పకపోతే పవన్ సినిమాలను నైజాంలో బ్యాన్ చేస్తామని ఒకరు హెచ్చరిస్తే.. తలతిక్కమాటలు మానుకోవాలని మరో మంత్రి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జనసేన తెలంగాణ ఇంఛార్జి స్పందించారు. పవన్ చేసిన వ్యాఖ్యల వెనుక అంతరాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు.
తెలంగాణను కించపరచలేదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని జనసేన తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్ పేర్కొన్నారు. అవి పవన్ ఉద్దేశపూర్వకంగా చేసిన మాటలు కాదని స్పష్టం చేశారు. ‘తెలంగాణ ను ఉద్దేశించి పవన్ మాట్లాడలేదు. ఎవరి దిష్టి తగిలిందో అని మాత్రమే అన్నారు. తెలంగాణ నాయకులు కొంతమంది గోదారి జిల్లాలు పచ్చగా ఉంటాయని పదే పదే చెప్పిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. మంత్రి కోమటి రెడ్డి మరోసారి పవన్ మాటలు వినండి. తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా ఎక్కడా మాట్లాడలేదు’ అని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.
‘హామీలపై దృష్టి పెట్టండి’
తెలంగాణపై పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టం, గౌరవం ఉందని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ జాతీయ పార్టీ.. జాతీయ భావాలతో అన్ని ప్రాంతాల కోసం వారు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ వాఖ్యలను కాంగ్రెస్ నేతలు వివాదం చేయవద్దు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో తాను పని చేస్తున్నట్లు గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక్కడి ప్రాంతమన్నా.. ప్రజలన్నా పవన్ కళ్యాణ్ కి ఎంతో అభిమానం. ఇక్కడితో ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలి. తెలంగాణ మంత్రులు ప్రజలు ఇవ్వాల్సిన హామీలను నెరవేర్చడంలో దృష్టి పెట్టాలి’ అని శంకర్ గౌడ్ హితవు పలికారు.
తలతిక్క మాటలు వద్దు: మంత్రి వాకిటి
అంతకుముందు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి.. పవన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. పవన్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని.. లేదంటే తెలంగాణలో తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ‘పవన్ తలతిక్క మాటలు మానుకోవాలి. తెలంగాణలోని వనరులను వాడుకోని ఈ స్థాయికి ఎదిగావు. మైలేజ్ కావలంటే పనితనం చూపించు.. మాటలు కాదు’ అంటూ మండిపడ్డారు.
Also Read: Sama Ram Mohan Reddy: హరీశ్ రావు చేతుల్లో బీజేపీ.. కమలం రాష్ట్రాధ్యక్షుడు కీలుబొమ్మ.. సామ సంచలన వ్యాఖ్యలు
నైజాంలో సినిమాలు ఆపేస్తాం: కోమటిరెడ్డి
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. మంచి చేయాలని ఉదేశంతో వచ్చి ఉంటారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. ‘పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్తే నైజాంలో రెండు రోజులైనా సినిమాలు ఆడుతాయి. లేదంటే సినిమా నడువదు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇది చెప్తున్నా. ఇప్పటికి 13ఏళ్లు అయింది తెలంగాణ వచ్చి. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం. తెలంగాణ బిడ్డలు బాధపడుతున్నారు’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

