Aarogyasri Services: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ఆరోగ్యశ్రీ (Aarogyasri) సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలను ఆయన రిక్వెస్ట్ చేశారు. వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, గడిచిన 21 నెలల్లో రూ.179 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని ఆయన వెల్లడించారు.
Also Read: CPI: తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం
అంతేగాక ప్యాకేజీల చార్జీల పెంపు కోసంప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలు దశాబ్దకాలం ఎదురుచూశాయని, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికిపైగా పెంచిన విషయాన్ని సీఈవో గుర్తు చేశారు. కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చి పేషెంట్లను ప్రభుత్వం ఆదుకుందన్నారు. చార్జీల పెంపు, కొత్త ప్యాకేజీల చేర్పుతో అదనంగా రూ. 487.29 కోట్లు పేషెంట్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు.
రూ.95 కోట్లు
2014 నుంచి 2023 నవంబర్ వరకూ సగటున నెలకు రూ.57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ సగటున నెలకు రూ.75 కోట్లు చెల్లించామన్నారు. ప్రస్తుతం నెలకు రూ.95 కోట్లు చెల్లిస్తున్నామని, హాస్పిటళ్ల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నెలకు వంద కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఉదయ్ వెల్లడించారు. హాస్పిటల్స్ యాజమాన్యాల ఇతర విజ్ఞప్తుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉదయ్ తెలిపారు.ఈ నేపథ్యంలో సేవల నిలిపివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని హాస్పిటళ్ల యాజమాన్యాలకు సీఈవో విజ్ఞప్తి చేశారు.
Also Read: Mahabubabad Collector: యూరియా సరఫరా పారదర్శకంగా చేపట్టాలి. కలెక్టర్ అద్వైత్ కుమార్ కీలక అదేశాలు
ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో చీలికలు.. నెట్ వర్క్ ఆసుపత్రుల ఏకపక్ష నిర్ణయాలపై ఆగ్రహం
ఆరోగ్య శ్రీ సమ్మె అంశంపై ఎం ప్యానల్ ఆసుపత్రుల్లో చీలికలు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీలో 470 వరకు ఎం ప్యానల్ దవాఖాన్లు ఉండగా, వీటిలో కేవలం వందకు పై బడి మాత్రమే సమ్మెకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మిగతా దవాఖాన్లు అన్నీ వైద్యసేవలు కొనసాగిస్తూనే, పెండింగ్ లోని సమస్యలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం నుంచి పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏక పక్ష నిర్ణయాలు సరైనవి కాదంటూ కొన్ని దవాఖాన్లు తేల్చి చెప్తున్నాయి.
పెండింగ్ లోని నిధులను విడతల వారీగా క్లెయిమ్ చేసుకొవాలని కొన్ని దవాఖాన్లు సూచిస్తుండగా, ప్రభుత్వం నుంచి పెండింగ్ నిధులు వచ్చే వరకు సమ్మే చేసి తీరాల్సిందేనని డాక్టర్ రాకేష్ వద్దిరాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్న నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. అయితే ఈ అసోసియేషన్ వెనక పొలిటికల్ శక్తులు ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తున్నది. బీఆర్ ఎస్ కు చెందిన ఓ కీలక నేత అండదండలతోనే నెట్ వర్క్ దవాఖాన్ల అసోసియేషన్ ఈ తరహాలో వ్యవహరిస్తున్నదని సర్కార్ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అంశంపై ఇన్వేస్టిగేషన్ కూడా చేస్తున్నట్లు సచివాలయంలోని ఓ అధికారి తెలిపారు.
బీఆర్ ఎస్ సగటు..రూ.670 కోట్లు..కాంగ్రెస్ సగటు..రూ.890 కోట్లు…
వాస్తవానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు ప్రతి ఏటా సగటున రూ. 670 కోట్లు ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 21 నెలల్లో(ఈ ఏడాది సెప్టెంబరు _వరకు) ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు రూ.1779 కోట్లు చెల్లించారు.అంటే సగటున సంవత్సరానికి 890 కోట్ల చెల్లించినట్టు లెక్క.మరో 3 నెలల కాలంలో చేసే పేమెంట్లతో సగటు వెయ్యి కోట్లు దాటే అవకాశం ఉన్నది. సోమవారం ఉదయమే ప్రభుత్వం మరో వంద కోట్లను కూడా రిలీజ్ చేసింది. దవాఖాన్ల అకౌంట్ లలో డబ్బులు జమ కాగానే నెట్ వర్క్ ఆసుపత్రులు పాత డేట్ తో స్ట్రైక్ నోటీసు రిలీజ్ చేశారు. దీంతో సర్కార్ కు అనుమానం మొదలైనది. ఎవరి ప్రోద్బలంతో సమ్మె నోటీస్ ఇచ్చారనే అంశంపై స్టడీ చేస్తున్నది. సీరియస్ గా పరిశీలించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది.
పదేళ్ల తర్వాత రేట్లు సవరణ..?
ఆరోగ్యశ్రీ ప్యాకేజీల చార్జీలు పెంచాలని బీఆర్‌ఎస్ హయాంలో ఏండ్ల తరబడి నెట్‌వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తూ వచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను సగటున 22 శాతం మేర పెంచారు. పదేళ్ల తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులను అనుగుణంగా రేట్లను పెంచారు. ఆరోగ్య ఉచిత వైద్యం లిమిట్ ను రూ. 5 నుంచి రూ. 10 లక్షలక పెంచారు. అంతేగాక ఎం ప్యానల్ లోనూ రూల్స్ సులభతరం చేసి ఏకంగా కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలో 120కిపైగా హాస్పిటళ్లకు ఎంప్యానెల్‌మెంట్ ఇచ్చారు.ఇంకా ఎంప్యానెల్ అవ్వడానికి మరి కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు పోటీ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎందుకు సమ్మె చేయాల్సి వచ్చింది?ఎవరి స్వలాభం కోసం సమ్మె ప్రకటన? అని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసినట్లు సమాచారం.
పేదలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. ఇక ఆరోగ్య శ్రీ స్కీమ్ కొరకు 2014 నుంచి 2023 వరకు బీఆర్ ఎస్ ప్రభుత్వం నెలకు సగటున రూ.52 కోట్లు ఖర్చు చేస్తే, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు నెలకు సగటున రూ.76 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. పెండింగ్ క్లియర్ అయ్యేందుకు ప్రతి నెల వంద కోట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా..నెట్ వర్క్ ఆసుపత్రుల తీరు మారడం లేదని ఉన్నతాధికారులు ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం గడిచిన పదేళ్ల నుంచి పెండింగ్ లో పెడుతూ వచ్చిన రూ.730 కోట్ల బకాయిలు ఉండటం వలన నెట్ వర్క్ ఆసుపత్రులకు పేమెంట్లు ఇబ్బందిగా మారాయని బోర్డు అధికారులు వెల్లడించారు.
Also Read: Mahabubabad Collector: యూరియా సరఫరా పారదర్శకంగా చేపట్టాలి. కలెక్టర్ అద్వైత్ కుమార్ కీలక అదేశాలు