AI vs IT Employees: కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, “ప్రోగ్రామింగ్ త్వరలో అవసరం ఉండదు” అనే వాదన మరింతగా వినిపిస్తోంది. కోడ్ రాయగలిగే, సాఫ్ట్‌వేర్‌ను నేరుగా ఎగ్జిక్యూట్ చేయగలిగే కొత్త AI మోడల్స్ వచ్చాక ఈ చర్చ మరింత వేడెక్కింది. అయితే, AI రంగానికి పునాది వేసిన వారిలో ఒకరైన జియోఫ్రీ హింటన్ మాత్రం ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పుబడుతున్నారు.
బిజినెస్ ఇన్ సైడర్ తో మాట్లాడిన హింటన్, కంప్యూటర్ సైన్స్ డిగ్రీని కేవలం కోడింగ్‌కే పరిమితం చేస్తారన్నది పెద్ద అపోహ అని చెప్పారు. రొటీన్ కోడింగ్, మిడ్-లెవెల్ ప్రోగ్రామింగ్ వంటి పనులు భవిష్యత్తులో AI చేతిలోకి వెళ్లొచ్చని ఆయన అంగీకరించినా.. CS డిగ్రీ ఇచ్చే కాన్సెప్ట్‌లు, ఫౌండేషనల్ నాలెడ్జ్ మాత్రం ఎప్పటికీ ప్రాముఖ్యత కోల్పోవని స్పష్టం చేశారు.
హింటన్ మాటల్లో, లాటిన్ భాష నేర్చుకున్నట్లు కోడింగ్ కూడా ఒక స్కిల్. ప్రతిరోజూ ఉపయోగం లేకున్నా, ఇవ్వబోయే కొత్త నిర్మాణం ఎంతో విలువైనది. కంప్యూటర్ సైన్స్‌లో ఉండే గణితం, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, లీనియర్ ఆల్జిబ్రా వంటి ఫార్ములాస్ సూత్రాలు భవిష్యత్తులో AI ఎంత ముందుకు వెళ్ళినా కూడా అత్యవసరమే అని ఆయన చెప్పారు.
తన అభిప్రాయాన్ని బలపరుస్తూ, ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇదే దిశలో మాట్లాడుతున్నారు. ఓపెన్ ఏఐ చైర్మన్ బ్రెట్ టేలర్, కోడింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ కాదు.. దానికంటే విస్తృత శాస్త్రం అని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కూడా, AI ఆటోమేషన్ పెరిగినా కంప్యూటేషనల్ థింకింగ్ విలువ తగ్గదు అని అన్నారు. అయితే, ఈ చర్చలో కొంచెం భిన్న వైఖరి చూపుతున్న వారు కూడా ఉన్నారు. ఎన్విడియా CEO జెన్సెన్ హువాంగ్, భవిష్యత్తులో కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరమే ఉండదు. AI భాషలోనే కంప్యూటింగ్ వ్యవస్థలు పనిచేస్తాయి అని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఆయన స్టేట్‌మెంట్ వివాదాస్పదమైనప్పటికీ, పరిశ్రమలో కొనసాగుతున్న భారీ మార్పులను ప్రతిబింబిస్తుంది.
AI ప్రోగ్రెస్‌తో మారుతున్న టెక్ రంగం ఈ సమయంలో గందరగోళంలో ఉన్నా.. హింటన్ వంటి నేతలు మాత్రం ఒకే విషయం స్పష్టం చేస్తున్నారు. CS డిగ్రీ బలం, దాని కాన్సెప్ట్‌లు, ఆలోచనా విధానం ఎప్పటికీ అవుట్‌డేటెడ్ కాదని స్పష్టం చేశారు.

