Archer Chikita: వరల్డ్ ఆర్చరీ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన తెలంగాణ బిడ్డ
గోల్డ్ మెడల్ సాధించిన రైతు బిడ్డ
తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: తెలంగాణకు చెందిన తానిపర్తి చికితా (Archer Chikita) భారత ఆర్చరీ చరిత్రలో అరుదైన ఘనత సాధించింది. పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల చికితా తన ప్రతిభతో కెనడా వేదికగా జరిగిన విన్నిపెగ్- 2025 వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ ఆర్చరీ పోటీల్లో అండర్-21 మహిళల కాంపౌండ్ విభాగంలో స్వర్ణం సాధించింది. దీంతో జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకున్న భారతదేశ మొదటి మహిళా కాంపౌండ్ ఆర్చర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.
సాధారణ రైతు కుటుంబానికి చెందిన చికితా తన కలలను నిజం చేసుకునే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. పోటీలకు వెళ్లే ముందు జరిగిన ఎయిర్‌లైన్ సమ్మె కారణంగా ఆమె కెనడాకు వెళ్లే విమానం రద్దు కావడంతో, పోటీల్లో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. విషయం తెలిసి, నిర్మాణ్ ఆర్గనైజేషన్, తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తక్షణమే జోక్యం చేసుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆమె సమయానికి విన్నిపెగ్ చేరుకునేలా సహకరించారు. అంతేకాకుండా, చికితా అనేక సంవత్సరాలుగా ఇన్‌ఆర్బిట్ మాల్స్, కే. రాహేజా కార్పొరేషన్ వారు తమ సీఎస్ఆర్ ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమం ‘ధనుష్ శక్తి’, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో నిరంతర సహకారం పొందుతోంది. చికితా ప్రపంచ యువ ఛాపియన్‌గా అవతరించడం రాష్ట్ర ప్రజలందరికి గర్వకారణమంటూ పలువురు కొనియాడుతున్నారు. ప్రాజెక్ట్ ధనుష్ శక్తి ద్వారా గత కొన్నేళ్లుగా ఆమెకు కావాల్సిన క్రీడా సామగ్రి, శిక్షణా సహాయం, మార్గదర్శకత్వం వంటివి ఆ సంస్థ అందించింది. అంతర్జాతీయ ఛాంపియన్‌గా ఎదగడానికి తోడ్పాటునిచ్చింది.
దేశం గర్వపడేలా…
ఈ బంగారు పతక విజయం మొత్తం భారత్‌ను గర్వపడేలా చేసిందని కే. రహేజా కార్పొరేషన్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ గోనే ప్రశంసించారు. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శరత్ బేలవాడి మాట్లాడుతూ, ప్రాజెక్ట్ ధనుష్ శక్తి ద్వారా తానిపర్తి చికితాకు అనేక సంవత్సరాలుగా అవసరమైన ఆర్చరీ పరికరాలు, సహాయం అందించామని చెప్పారు. చికితా గెలిచిన గోల్డ్ మెడల్, ఆమె పట్టుదలను నిరూపించిందని అభినందించారు.
2019లో తన ఆర్చరీ ప్రయాణాన్ని ప్రారంభించిన చికితా, 2020లో తన మొదటి జాతీయ పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున పతకాలు సాధించి, తన ప్రతిభను చాటుకుంది. కేవలం 20 ఏళ్ల వయసులో చికితా, కెనడాలో జరిగిన వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు బంగారు పతకం సాధించి, దేశం గర్వపడేలా చేసింది. గత కొన్నేళ్లుగా వెనుకబడిన, గిరిజన విద్యార్థులు, యువ క్రీడాకారులకు కావలసిన పరికరాలు, శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తూ వారి కలలు నిజం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని శరత్ చెప్పారు. చికితా సాధించిన గోల్డ్ మెడల్ తమకు గర్వకారణమని, ఇలాంటి మరెన్నో యువ క్రీడాకారులను ముందుకు తేవడానికి ఇది మరింత ప్రేరణ ఇస్తుందని నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, గ్లోబల్ సీఈఓ మయూర్ పత్నాల పేర్కొన్నారు.