Sana Mir Controversy: ఇటీవలే ముగిసిన మెన్స్ ఆసియా కప్-2025లో భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ల సందర్భంగా పలు వివాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లపై పరస్పర ఫిర్యాదుల మధ్యే టోర్నీ ముగిసింది. అయితే, తాజాగా మహిళల వన్డే ప్రపంచ కప్-2025 నేపథ్యంలో మరో వివాదం రాజుకుంది. పాకిస్థాన్ ఉమెన్స్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్ రాజకీయపరమైన (Sana Mir Controversy) వ్యాఖ్యలు చేసింది. శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా శ్రీలంక – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కామెంటరీ బాధ్యతలు నిర్వహించిన సనా మీర్.. పాక్ జట్టు ప్లేయర్ నటాలియా పర్వేజ్ బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు ‘ఆమె ఆజాద్ కశ్మీర్’ నుంచి వచ్చిందంటూ రాజకీయ వ్యాఖ్య చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు (POK) చెందిన యువతి అని చెప్పకుండా ‘ఆజార్ కశ్మీర్’ అని చెప్పిన వీడియో క్లిపింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, మీర్ తన వ్యాఖ్యను సవరించుకునే ప్రయత్నం చేసింది.
సనా మీర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది రాజకీయ వ్యాఖ్యలు కాకపోతే మరేంటి? అని నెటిజన్లు గట్టిగా నిలదీస్తున్నారు. క్రికెట్ వ్యాఖ్యత బాధ్యత మరిచి, రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారికి తిరిగి కామెంటరీ అవకాశం ఇవ్వకూడదని భారతీయ మద్దతు డిమాండ్ చేస్తున్నారు.
Read Also- XFG variant: అమెరికాలో కరోనా కొత్త వేరియెంట్ విజృంభణ.. లక్షణాలు ఇవే
ఈ వివాదాన్ని పక్కనపెడితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి పాక్ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఉమెన్స్ మరో 113 బంతులు మిగిలివుండగానే ఛేదించారు. కేవలం 20 ఏళ్ల వయసున్న బంగ్లాదేశ్ యువ ప్లేయర్ మారుఫా అక్తర్ అద్భుతంగా బౌలింగ్ చేయడం, బ్యాటింగ్‌లో రుబియా హైదర్ అజేయ హాఫ్ సెంచరీ, కెప్టెన్ నిగర్ సుల్తానా కీలక ఇన్నింగ్స్ ఆడడం బంగ్లాదేశ్ విజయానికి కారణమయ్యాయి. రుబియా 77 బంతుల్లో 8 బౌండరీల సాయంతో 54 పరుగులు సాధించి, నాటౌట్‌గా నిలిచింది. ఇక, బంగ్లా కెప్టెన్ సుల్తానా 44 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేసింది. రుబియా-సుల్తానా కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో, 31.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది.
Read Also- Elon Musk: సంపద విషయంలో ఎలాన్ మస్క్ అరుదైన ఘనత.. ఈ భూమ్మీద తొలి వ్యక్తి ఆయనే
కాగా, భారత్, శ్రీలంక వేదికగా మహిళ వరల్డ్ కప్-2025 కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ మహిళా జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీలో గురువారం నాటికి మూడు మ్యాచ్‌లు జరగగా, భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఒక్కో విజయాన్ని సాధించాయి. శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్ చొప్పున ఓడిపోయాయి. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఇంకా ఆరంభం మ్యాచ్ ఆడాల్సి ఉంది.