National Sports Day
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

National Sports Day: నేడు జాతీయ క్రీడాదినోత్సవం.. ‘ధ్యాన్‌చంద్’ గొప్పతనం ఏంటో మీకు తెలుసా?

National Sports Day: క్రీడారంగానికే వన్నె తెచ్చిన ‘ధ్యాన్‌చంద్‌’

మననం చేసుకున్న మహబూబాబాద్‌ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం

మహబూబాబాద్, స్వేచ్ఛ: భారత హాకీ దిగ్గజం ‘మేజర్ ధ్యాన్‌చంద్’ జయంతి సందర్భంగా శుక్రవారం (ఆగస్టు 29) నాడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ క్రీడాదినోత్సవ (National Sports Day) వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్‌ అథ్లెటిక్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం మాట్లాడుతూ, ‘ధ్యాన్‌చంద్‌’ క్రీడారంగానికే వన్నె తెచ్చారని గుర్తుచేసుకున్నారు. క్రీడా రంగ దిగ్గజం అంటూ కొనియాడారు. కాగా, ధ్యాన్‌చంద్ జీవితానికి సంబంధించిన కొన్ని విశేష ఘట్టాలను మహబూబాబాద్‌ అథ్లెటిక్ అసోసియేషన్ (మా) సమీకరించింది.

Read Also- Ganesh Mandapams Hyderabad: హైదరాబాద్ టాప్-7 గణేష్ మండపాలు.. ఇప్పుడు మిస్ అయితే.. ఏడాదంతా బాధపడాల్సిందే!

ఆ వివరాలు ఇవే..
హాకీ క్రీడారంగ చరిత్రలోనే భారత్‌ సువర్ణక్షరాలతో లిఖించదగ్గ హాకీ మాంత్రికుడు, హాకీ కలికితురాయిగా పేరుగాంచిన ధన్యజీవి మేజర్‌ ధ్యాన్‌చంద్‌. భారత హాకీ జట్టును ప్రపంచంలోనే అగ్రగ్రామిగా నిలిపేందుకు తన హాకీ స్టిక్‌ను మంత్ర దండంగా ప్రయోగించి విజయ పరంపరను సొంతం చేసిన అజాత శత్రువు, త్యాగమూర్తి, నిరాండబరుడు ‘ధ్యాన్‌చంద్‌’. కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌ ఖేల్‌‌రత్న అవార్డును ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌‌రత్’ పేరు మీదుగా నామకారణం చేసింది. దీంతో, క్రీడాలోకం ఆయనకు ఘనమైన నివాళులు అర్పించింది. తద్వారా క్రీడారంగంలో ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలన్న క్రీడాలోకం నిరీక్షణకు ఆశాజనకమైన ఫలితం దక్కింది. 1928 నుంచి 1936 వరకు వరుసగా జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించడమే కాకుండా, భారత జట్టును ప్రపంచంలోనే ఆగ్రస్థానంలో నిలిపేందుకు ఎంతో కృషి చేసిన దిగ్గజం. 1926 వరకు హాకీలో భారత్‌‌కు జవసత్వాలు నింపి ఒలింపిక్‌ క్రీడలే లక్ష్యంగా ఎంచుకుని ముమ్మర సాధన చేశారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు 3 స్వర్ణాలు అందించారు. క్రీడారంగంలో అంతటి ఘనకీర్తిని సాధించినందున ఆయన పుట్టిన రోజైన ఆగష్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

భారత్‌ తరపున ప్రాతినిధ్యం

అంచనాలు లేకుండా 1928 ఒలింపిక్ క్రీడల్లో భారత్ బరిలోకి దిగి, స్వర్ణ పతకం సాధించడంలో ధ్యాన్‌చంద్ కీలక పాత్ర పోషించాడు. అక్కడి నుంచి భారత హాకీ జట్టు వెనుదిరిగి చూసుకోలేదు. 1932 లాస్‌ ఏంజిల్స్, 1936 బెర్లిన్‌ ఒలింపిక్‌ క్రీడల్లో స్వర్ణాలు సాధించిన జట్టులో ధ్యాన్‌చంద్ అత్యంత ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నారు. ఒలింపిక్స్ మాత్రమే కాదు, వివిధ అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారత్‌ తన జోరును కొనసాగించడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు.

సిపాయి నుంచి అంతర్జాతీయ క్రీడాకారుడిగా..
మేజర్ ధ్యాన్‌చంద్ సిపాయి స్థాయి నుంచి అంతర్జాతీయ క్రీడాకారుడు స్థాయికి క్రమశిక్షణతో ఎదిగారు. ఆర్మీలో చేరకముందే హాకీలో తగిన రీతిలో ప్రావీణ్యం కనబరిచి జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు, ప్రశంసలు పొందారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలాహాబాద్‌లో 1905 ఆగస్టు 29న ఆయన జన్మించారు. ధ్యాన్‌చంద్ రాజపుత్రీయుల వంశానికి చెందినవారు. 1921లో ఆర్మీలో సిపాయిగా చేరి అక్కడే హాకీలో శిక్షణ పొందారు. భారత జాతీయ జట్టుకు తొలిసారిగా 1928లో ఎంపికయ్యారు. అదే ఏడాది ‘అమ్‌స్టర్‌డమ్‌ ఒలింపిక్స్‌’ కూడా జరిగాయి. ఆ సమయంలో భారత హాకీ జట్టుకు జైపాల్‌సింగ్‌ సారధ్యం వహించారు. ఆస్ట్రేలియా, బెల్జియం, డెన్మార్క్, స్విజర్లాండ్ జట్లను ఓడించి భారత జట్టు ఫైనల్స్‌కు చేరింది.

ఫైనల్స్‌లో భారత్‌–నెదర్లాండ్ ఢీ

1928 ఒలింపిక్ హాకీ ఫైనల్స్‌లో భారత్-నెదర్లాండ్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ మ్యాచ్‌లో ధ్యాన్‌చంద్‌ అదరగొట్టారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు నెదర్లాండ్‌పై 3–0 గోల్స్‌ తేడాతో నెగ్గి స్వర్ణం దక్కించుకుంది. అప్పటి వరకు హాకీ జట్టును ఒలింపిక్స్‌ పంపేందుకు ఇష్టపడని కొంతమంది పెద్దలకు భారత జట్టు ఏకంగా స్వర్ణం గెలవడం నచ్చలేదని చెబుతారు. ఆ తర్వాత 1932 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌‌లో, 1936 బెర్లిన్‌ ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణాలు దక్కించుకుంది. బెర్లిన్ ఒలింపిక్స్‌లో ధ్యాన్‌చంద్‌ సారథ్యంలో ప్రతి మ్యాచ్‌ను భారత్ సులువుగా గెలిచింది. అత్యధిక గోల్స్‌ చేసిన ధ్యాన్‌చంద్‌ భారత విజయంలో కీలక పాత్ర వహించారు. ఆయన ఆటను చూసి జర్మని అధ్యక్షుడు హిట్లర్‌.. నేరుగా ధ్యాన్‌చంద్‌ వద్దకు వచ్చి ‘‘భారత్‌ తరపున ఆడితే నీకు ఉద్యోగోన్నతి ఉండదు.. మా తరపున ప్రాతినిధ్యం వహిస్తే జర్మనీ పౌరసత్వంతో పాటు కల్నల్‌ హోదాతో కాసుల వర్షం కురిపిస్తాం’ అని ఆశచూపారు. కానీ, ధ్యాన్‌చంద్‌ దానిని సున్నితంగా తిరస్కరించారు. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుపై ఒక్క గోల్‌ సాధింకపోవడంతో గోల్‌ పోస్టు విషయంపై రిఫరీకి ధ్యాన్‌చంద్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పరిశీలనలో గోల్‌ పోస్టు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది.

1921లో సిపాయిగా

1921లో సిఫాయిగా చేరిన ధ్యాన్‌చందర్ చివరిగా మేజర్ హోదాలో రిటైర్ అయ్యారు. ధ్యాన్‌చంద్‌ను పద్మవిభూషణ్‌ అవార్డుతో సత్కరించారు. 1979 నవంబర్‌ 3న ఆయన కన్నుమూశారు. ధ్యాన్‌చంద్‌ హాకీలో ఎంతో నైపుణ్యం చూపారు. ఇంకా చెప్పాలంటే భారత క్రీడా రంగానికి గుర్తింపు తీసుకురావడంలో ఎంతగానో కృషి చేశారు. ధ్యాన్‌చంద్ అప్పట్లో తన ప్రతిభను చాటి చెప్పకపోతే నేడు దేశ క్రీడల రంగం ఏ స్థాయిలో ఉండేదో ఊహించలేం. జాతీయ క్రీడగా హాకీని గుర్తించి దేశంలో ఈ క్రీడ మెరుదల కోసం పాటుపడుతున్న మన దేశంలో ఒలింపిక్‌లో పాల్గొనే భారత జట్టుకు స్పాన్సర్స్‌లో లేకపోవడం అత్యంత శోచనీయం. ఒడిశా ప్రభుత్వం వంద కోట్ల బడ్జెట్‌ను కేటాయించి క్రీడాస్పూర్తికి మార్గద్శకంగా నిలిచింది. ధ్యాన్‌చంద్‌ సోదరుడు రూప్‌సింగ్, అతని కొడుకు అశోక్ ‌కుమార్‌లు ఇద్దరూ ఒలింపియన్‌లే. ఇద్దరికి స్వర్ణ పతకాలు గెలుచుకున్న క్రీడాకారులే కావడం విశేషం. రూప్‌సింగ్‌ ధ్యాన్‌చంద్‌తో కలిసి ఆడితే 1980లో రష్యాలో జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో ఆయన కుమారుడు స్వర్ణపతకం సాధించారు. తండ్రికి తగిన తనయుడుగా హాకీలో పలు అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాడు.

హాకీకి ఆదరణ
వరుసగా మూడు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు దక్కడం, భారత్‌ జట్టులో ధ్యాన్‌చంద్‌ ఉండటంతో దేశంలో హాకీకి అన్ని విధాల గుర్తింపు దక్కింది. ప్రతి గ్రామంలో అప్పట్లో హాకీ మైదానాలు ఉండేవి. విస్తృతంగా ఆడే వారు. పెవిలియన్‌గ్రౌండ్‌లో నిత్యం ప్రాక్టిస్‌ చేసేవారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో హాకీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లితే భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు క్రీడాకారులు సాధిస్తారు. ఏదో ప్రాక్టిస్‌ చేసిన కదా జాతీయ, రాష్ట్ర జట్టుకు ఎందుకు ఎంపిక కావడం లేదనే ఆపోహాలు వీడి నిరంతరం సాధన చేస్టే తప్పక ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగే ఆవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు