Ind vs Pak Asia Cup Final: ఆసియా కప్ 2025 తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. భారత్ – పాక్ జట్లు మధ్య ఆదివారం (సెప్టెంబర్ 28) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గం.లకు (భారత కాలమానం ప్రకారం) తుది పోరు జరగనుంది. అయితే రేపు జరగబోయే మ్యాచ్ కు ఎంతో విశిష్టత ఉంది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్ – పాక్ తొలిసారి ఫైనల్స్ లో తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం.
ముచ్చటగా మూడోసారి ఒడిస్తారా?
ఆసియా కప్ 2025 టీ-20 టోర్నీలో ఇప్పటికే భారత్ – పాక్ రెండుసార్లు తలపడ్డాయి. రెండు మ్యాచుల్లోనూ భారత్ ఘన విజయం సాధించి తన సత్తా చూపించింది. దీంతో ఆదివారం జరిగే ఫైనల్స్ లోనూ తన చిరకాల ప్రత్యర్థిని మట్టికరిపించి.. ఆసియా కప్ ను మరోమారు ముద్దాడాలని కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇప్పటికే భారత్ చేతుల్లో రెండుసార్లు ఓడి చావు దెబ్బ తిన్న పాక్ జట్టు.. ఫైనల్లో ఎలాగైన గెలవాలని పట్టుదలగా ఉంది.
గ్రూప్ దశలో భారత్ – పాక్ ప్రదర్శన
ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్ ప్రయాణం దుర్భేధ్యంగా కొనసాగింది. ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా విజయపతాకం ఎగురవేసింది. చివరిగా ఆడిన సూపర్ ఫోర్‌లో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించడం ద్వారా భారత్ ఫైనల్ టికెట్ ఖరారు చేసుకుంది. అయితే దయాది టీమ్ పాక్ మాత్రం తడబడుతూనే చివరికి ఫైనల్ చేరింది. గురువారం రాత్రి బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అతి కష్టం మీద గెలిచి.. ఫైనల్ కు వచ్చింది.
ఆసియా కప్ ఫైనల్ రికార్డ్స్
ఆసియా కప్ లో భారత్ కు గణనీయమైన రికార్డే ఉన్నాయి. ఇప్పటివరకూ 12 సార్లు ఫైనల్స్ ఆడిన టీమిండియా.. అందులో 8సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. రెండుసార్లు రన్నరప్ గా టోర్నీని ముగించింది. అటు పాక్ 5 సార్లు ఫైనల్ చేరగా.. అందులో 2 సార్లు మాత్రమే గెలిచింది. మూడుసార్లు ప్రత్యర్థులకు టైటిల్ ను సమర్పించుకుంది. భారత్ ఎప్పటిలాగే ఆసియా కప్ 2025లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. పాక్ మాత్రం కింద మీద పడుతూ పసికూనల చేతుల్లోనూ అతి కష్టంమీద విజయాలు సాధిస్తూ ఫైనల్ చేరింది.
Also Read: Bigg Boss Telugu Promo: వైల్డ్ కార్డు దివ్యతో బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్.. టాప్‌లోకి దూసుకొచ్చిన భరణి!
ఇతర టోర్నీలో ఆందోళనకర రికార్డ్స్
అయితే ఇతర టోర్నమెంట్ల ఫైనల్స్ లో పాకిస్థాన్ పై భారత్ కు చెప్పుకోతగ్గ రికార్డ్స్ ఏమీ లేవు. 1986 ఆస్ట్రల్ – ఆసియా కప్ ఫైనల్లో పాక్ 1 వికెట్ తేడాతో భారత్ ను ఓడించింది. 1994 ఆస్ట్రల్-ఆసియా కప్ లోనూ పాకిస్థాన్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2007 ఐసీసీ T20 వరల్డ్ కప్ (జోహన్నెస్‌బర్గ్) లో భారత్ 5 పరుగుల తేడాతో పాక్ ను ఓడించింది. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (లండన్)లో భారత్ పై పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్ గా 5 ఫైనల్స్ లో భారత్ – పాక్ తలపడగా అందులో టీమిండియా 2 విజయాలు నమోదు చేసింది. ప్రస్తుతం ఇది టీమిండియా ఫ్యాన్స్ ను కలవరపాటుకు గురిచేస్తోంది.
ఫైనల్ ఎలా చూడాలంటే?
ఆసియా కప్ టోర్నీ సోనీ టీవీ నెట్ వర్క్ అధికారిక బ్రాడ్ కాస్టర్ గా వ్యవహరిస్తోంది. సోనీ టీవీ ఛానెల్స్ తో పాటు ఆ కంపెనీకి చెందిన ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో భారత్ – పాక్ ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.