IND vs NZ 2nd T20I: భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రెండో టీ-20 జరగనుంది. రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం (Shaheed Veer Narayan Singh International Cricket Stadium)లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే నాగ్ పూర్ వేదికగా సోమవారం జరిగిన తొలి టీ-20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ (35 బంతుల్లో 84 పరుగులు) దెబ్బకు భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు టీ20ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇవాళ జరిగే మ్యాచ్ లోనూ సత్తా చాటి సిరీస్ పై పట్టు సాధించాలని టీమిండియా భావిస్తోంది.
అక్షర్ ఔట్.. కుల్దీప్ ఇన్!
తొలి టీ-20లో అభిషేక్ శర్మ సత్తా చాటడం, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం తిరిగి ఫామ్ లోకి రావడం టీమిండియా ఫ్యాన్స్ ను సంతోషానికి గురిచేసింది. మరోవైపు ఫస్ట్ మ్యాచ్ లో విఫలమైన సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో తమ ప్రతిభ నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. అటు చాలా రోజుల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన రింకూ సింగ్.. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. రాబోయే వరల్డ్ కప్ లో జట్టుకు తాను ఎంత విలువైన ఆటగాడినో మరోమారు నిరూపించుకున్నాడు. అయితే తొలి టీ-20లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Akshar Patel) వేలికి తీవ్ర గాయం కాగా.. అతడికి రెండో టీ-20లో రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను ఎంపిక చేసే అవకాశమున్నట్లు క్రీడా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
హెడ్ టూ హెడ్ రికార్డ్స్..
భారత్, కివీస్ జట్ల మధ్య ఇప్పటివరకూ 26 టీ-20 మ్యాచ్ లు జరగ్గా అందులో భారత్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీమిండియా 16 మ్యాచుల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ పందింటిలో గెలిచింది. అయితే న్యూజిలాండ్ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఆ జట్టును తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భారత్ తో వన్డే సిరీస్ నుంచి భీకర ఫామ్ లో ఉన్న డారిల్ మిచెల్, గ్లెస్ ఫిలిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
రాయ్ పూర్ పిచ్ రిపోర్ట్..
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం సమతుల్యమైన పిచ్ గా చెప్పవచ్చు. బౌలర్లు, బ్యాటర్లకు సమానంగా పిచ్ నుంచి సహకారం లభించనుంది. ఆట ప్రారంభంలో బౌలర్లు పై చేయి సాధిస్తారని.. ఓపెనర్స్ కు సవాళ్లు తప్పవని పిచ్ క్యూరేటర్ తెలిపారు. అయితే మ్యాచ్ సాగే కొద్ది.. పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారుతుందని స్పష్టం చేశారు. ఆచితూచి ఆడగలిగిన జట్టు మంచి స్కోరు సాధించేందుకు వీలు పడుతుందని చెప్పారు.
Also Read: Sama Ram Mohan Reddy: సిట్ ముందుకు కేటీఆర్.. బయట జరిగే డ్రామాలు.. సీన్స్ వారీగా కాంగ్రెస్ రివీల్!
మ్యాచ్‌ను ఎక్కడ చూడాలంటే?
సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ ను జియో హాట్ స్టార్ యాప్, వెబ్ సైట్ లో వీక్షించవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానళ్లలోనూ చూడవచ్చు. అయితే మ్యాచ్ ను ఉచితంగా చూసే అవకాశాన్ని సైతం జియో కల్పించింది. కొన్ని మెుబైల్ రీఛార్జ్ ప్లాన్స్ తో కలిపి జియో హాట్ స్టార్ ను ఉచితంగా అందిస్తోంది. సదరు ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే ఫ్రీగా హాట్ స్టార్ లో మ్యాచ్ చూడొచ్చు.
భారత జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ / కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్, శివం దూబే, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

