India vs Pakistan: ఆసియా కప్ – 2025లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ సహా ఈ టోర్నీలో మూడుసార్లు పాక్ తో తలబడిన భారత్.. మూడింటిలోనూ చిత్తుగా ఓడించింది. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భారత్ ప్లేయర్లు ఇష్టపడలేదు. కనీసం పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ప్రస్తుత ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి కూడా భారత ఆటగాళ్లు ఇష్టపడలేదు. దీంతో ఈ వ్యవహారం క్రికెట్ లో తీవ్ర చర్చకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆటగాడు.. టీమిండియాపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘ఇకపై భారత్‌తో ఆడొద్దు’
పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్.. భారత్ పై నోరుపారేసుకున్నారు. పాక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై భారత్ తో క్రికెట్ ఆడొద్దని పిలుపునిచ్చారు. పాక్ క్రికెట్ బోర్డు దీనిపై తక్షణమే ప్రకటన చేయాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దామని పేర్కొన్నారు. ‘ఇంకేం సాక్ష్యం కావాలి? బీసీసీఐ వ్యక్తి (జై షా) ఐసీసీని నడుపుతున్నారు. ఆయన ఏం చర్య తీసుకుంటారు? మిగతా బోర్డులు కలసి రావాలి. పాక్ తో గత పదేళ్లుగా భారత్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. అంతర్జాతీయ టోర్నీల్లో మాత్రమే పాక్ తో టీమిండియా ఆడుతోంది. క్రీడ ఏ ఒక్కరి ఇంట్లో, ఏ ఒక్కరికీ అనుకూలంగా జరగదు. ఇకపై భారత్ పాక్ జట్టు మ్యాచ్ లు ఆడొద్దు. మిగతా బోర్డులు సైతం మాతో కలిసి రావాలి. టీమిండియాతో ఆడకపోతే వారికి డబ్బు రాదు’ అని అన్నారు.
న్యూట్రల్ బాడీ అవసరం
ఆసియా కప్ లో భారత్ – పాక్ మధ్య చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనలకు సంబంధించి దర్యాప్తు జరిపేందుకు న్యూట్రల్ బాడీని ఏర్పాటు చేయాలని కమ్రాన్ అక్మల్ కోరారు. భారత్, పాక్ సభ్యుల ప్రాతినిథ్యం లేకుండా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. టోర్నమెంట్ లో జరిగిన వాటిపై వారు దర్యాప్తు జరిపి.. ఏం చర్యలు తీసుకోవాలే వాళ్లే నిర్ణయించాలని సూచించారు.
Also Read: Non Veg Shops Closed: మాంసం ప్రియులకు షాక్.. చికెన్, మటన్ షాపులు బంద్.. జీహెచ్ఎంసీ అధికారిక ప్రకటన
టీమిండియాపై వివాదస్పద వ్యాఖ్యలు
భారత్ – పాక్ మధ్య జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్స్ గురించి ప్రస్తావిస్తూ కమ్రాన్ అక్మల్ టీమిండియాపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైనల్‌లో భారత్ వ్యవహరించిన తీరును ‘చీప్ ట్రిక్స్’ గా ఆయన అభివర్ణించారు. ‘భారత్ నుంచి ఇలాంటి తక్కువ స్థాయి ప్రవర్తన చూస్తూనే ఉంటాం. ఈ టోర్నమెంట్‌లో వారు క్రికెట్‌కు ఎంత నష్టం చేయగలరో అంత చేశారు. పీసీబీ, ఏసీసీ అధ్యక్షులు సరైన నిర్ణయం తీసుకున్నారు. ట్రోఫీ ఇవ్వాలా? వద్దా? అనేది అధ్యక్షుడే చెబుతారు. పాక్ జట్టుపై ఇలాగే వ్యవహరిస్తూ పోతే ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా హాస్యాస్పదంగా మారుతుంది’ అని అక్మల్ అన్నారు.