Asia Cup Trophy Row: ఆసియా కప్-2025ను భారత జట్టు అద్భుత రీతిలో గెలుచుకుంది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌పై ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. కానీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ మంత్రి, పీసీబీ ప్రెసిడెంట్ మోహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ స్వీకరించేందుకు టీమిండియా క్రికెటర్లు (Asia Cup Trophy Row) నిరాకరించారు. దీంతో, మోహ్సిన్ నక్వీ ట్రోఫీ ఇవ్వకుండానే తనతో పాటు హోటల్‌కు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 30) జరిగిన ఏసీసీ వార్షిక సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్‌కు ట్రోఫీ ఇవ్వకపోవడం సరికాదని నిరసన వ్యక్తం చేసింది.
ఆసియా కప్ ట్రోఫీ ఏసీసీకి చెందినదని, ఎవరికీ వ్యక్తిగతమైనది కాదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాజీ మండిపడ్డారు. కాబట్టి, విజేతగా నిలిచిన జట్టుకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అన్నారు. మొత్తంగా ట్రోఫీ ఇవ్వకపోవడం, పోస్ట్ మ్యాచ్ అవార్డు వేడుకలో ఏసీసీ చైర్మన్ చేసిన డ్రామాపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అయితే, మోహ్సిన్ నక్వీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదని, ట్రోఫీ ఇవ్వడానికి అంగీకరించలేదని ఏసీసీ వర్గాలు తెలిపాయి. మంగళవారం జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ తరఫున వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మాజీ ట్రెజరర్ ఆశిష్ షెళార్ పాల్గొన్నారు.
Read Also- Dimple Hayathi: పెంపుడు కుక్కల వ్యవహారం.. మరో కాంట్రవర్సీలో డింపుల్ హయాతి!
కాగా, ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం ఏసీసీ ఆఫీసులోనే ఉంది. భారత జట్టుకు ఎప్పుడు అందిస్తారనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదని ఏసీసీకి చెందిన ఒక అధికారి పేర్కొన్నారు. ట్రోఫీ ఇవ్వడానికి నక్వీ ఒప్పుకోలేదని వివరించారు. కాగా, ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత ట్రోఫీ ఇవ్వాల్సిన సమయంలో, పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నక్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది.
నక్వీ డిమాండ్ ఇదేనా?
ఊహించని పరిణామాలు జరిగిన రెండు రోజుల తర్వాత కూడా టీమిండియా ఆటగాళ్లకు ట్రోఫీని ఎప్పుడు అందిస్తారనే విషయంలో క్లారిటీ లేదు. అయితే, మోహ్సిన్ నక్వీ ట్రోఫీని భారత్‌కు అందించడానికి సిద్ధంగా ఉన్నాడని, కానీ, ఒక్క షరతు విధిస్తానంటున్నాడని తెలుస్తోంది. భారత్ జట్టు ట్రోఫీతో పాటు మెడల్స్ స్వీకరించాలంటే, ఒక అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని, ఆ కార్యక్రమంలో తానే స్వయంగా ట్రోఫీ, మెడల్స్ అందిస్తానంటూ షరతు విధించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు టోర్నమెంట్ నిర్వాహకులకు నక్వి సందేశం ఇచ్చినట్టుగా ‘క్రిక్‌బజ్’ కథనం పేర్కొంది. భారత్ – పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాలు చాలా సున్నితంగా మారిపోయిన నేపథ్యంల, అధికారిక కార్యక్రమం నిర్వహించి, అందులో మోహ్సిన్ నక్వీ పాల్గొనే అవకాశం ఇవ్వడం దాదాపు జరగకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఆసియా కప్ ట్రోఫీ, మెడల్స్‌ను నక్వీ తనతో పాటు హోటల్ గదికి తీసుకెళ్లిన తీరు తీవ్ర బాధాకరమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మండిపడ్డారు. భారత్ జట్టు స్వీకరించాల్సిన ట్రోఫీని మోహ్సిన్ నక్వీ తన హోటల్ గదికి తీసుకెళ్లడంతో ప్రపంచ క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Read Also- Viral News: కోచింగ్ సెంటర్‌లో ప్రేమాయణం.. టీచర్‌ను పెళ్లి చేసుకున్న విద్యార్థిని.. ఆ తర్వాత..