Bangladesh-ICC: భారత్ వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్-2026 (T20 World Cup 2026) నుంచి పొరుగుదేశం బంగ్లాదేశ్ తప్పుకోవడం ఖరారైంది. ఆడితే భారత్ వేదికగా ఆడాలి, లేదంటే, వేరే జట్టును టోర్నీమెంట్‌లోకి తీసుకుంటామని, దీనిపై 24 గంటల్లో సమాధానం ఇవ్వాలంటూ ఐసీసీ విధించిన డెడ్‌లైన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చర్చించి (Bangladesh-ICC) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడబోమని గురువారం స్పష్టం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వ స్పోర్ట్స్ అడ్వైజర్ అసిఫ్ నజ్రుల్‌తో బంగ్లా క్రికెట్ బోర్డు అధికారులు చర్చించిన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీబీ అధికారులు, జాతీయ జట్టు క్రికెటర్లు, ప్రభుత్వ స్పోర్ట్స్ అడ్వైజర్ అసిఫ్ నజ్రుల్ కూడా ఈ కీలక సమావేశం పాల్గొన్నారు. దీంతో, టోర్నమెంట్‌ను బాయ్‌కాట్ చేయాలనే ఉద్దేశ్యాన్ని ప్రకటించినట్టు అయ్యింది.
బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ అసిఫ్ నజ్రుల్ స్పందిస్తూ, బంగ్లాదేశ్‌కి న్యాయం చేయడంలో ఐసీసీ విఫలమైందని ఆరోపించారు. ‘‘ఐసీసీ మనకు న్యాయం చేయలేదు. ఈ సమస్య కేవలం క్రికెట్‌కు సంబంధించినది మాత్రమే కాదు. మేము తలవంచబోం. ఒకవేళ బంగ్లాదేశ్ వరల్డ్ కప్ ఆడకపోతే దానర్థం ఏమిటో అందరూ అర్థం చేసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ మా ప్లేయర్ల భద్రతను త్యాగం చేయలేము’’ అని అన్నారు.
కాగా, షెడ్యూల్ ప్రకారం, టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ జరుగుతుందని ఐసీసీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. బంగ్లాదేశ్ ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహించగా, 14-2 తేడాతో తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.
ఆ స్థానంలో స్కాట్‌లాండ్
టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ నిష్ర్కమించడం దాదాపు ఖరారు కావడంతో, క్వాలిఫై కాకపోయినా స్కాట్‌లాండ్‌కు అవకాశం దక్కనుంది. బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచ్‌ల్లో స్కాట్‌లాండ్ జట్టు ఆడుతుంది. కాగా, ప్రస్తుత షెడ్యూల ప్రకారం, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, వెస్ట్ ఇండీస్ జట్లు గ్రూప్-సీలో ఉన్నాయి. బంగ్లాదేశ్ లీగ్ దశ మ్యాచ్‌లను మూడింటిని కోల్‌కతాలో, ఒక మ్యాచ్‌ను ముంబైలో ఆడాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాలను చూపుతూ తమ శ్రీలంకకు మార్చాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థించిన విషయం తెలిసిందే.
Read Also- Army Vehicle Accident: తీవ్ర విషాదం.. వాహనం లోయలో పడి 10 మంది భారత సైనికులు కన్నుమూత

