Australia Women vs India Women: భారత్ ఆతిథ్యం ఇస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది. నేడు జరిగే సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. కాబట్టి టైటిల్ పోరులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇదిలా ఉంటే ముంబయిలోని డాక్టర్ డి.వై. పాటిల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండగా తాజాగా టాస్ పడింది.
టాస్ ఎవరు గెలిచారంటే?
సెమీస్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బౌలింగ్ చేయనుంది. అయితే ఈ ప్రపంచకప్ టోర్నీలో మహిళల జట్టుకు టాస్ అస్సలు కలిసిరావడం లేదు. టోర్నీలో టీమిండియా ఆడిన 8 మ్యాచుల్లో ఏడుసార్లు టాస్ ఓడిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే సెమీస్ లో తలపడే జట్టును కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రివీల్ చేశారు.
మహిళల జట్టు: షెఫాలి వర్మ, స్మృతి మందన, అమన్ జ్యోత్ గౌర్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుక సింగ్ ఠాకూర్
వరుణుడి ముప్పు..
కీలకమైన సెమీస్ పోరుకు వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న ముంబయిలో వాతావరణం మేఘావృతమై ఉంది. మ్యాచ్ మధ్యలో వర్షం ఆటంకం కలిగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మ్యాచ్ సమయంలో కొద్దిపాటి జల్లులు పడినప్పటికీ అది పూర్తి స్థాయిలో మ్యాచ్ ను రద్దు చేసే విధంగా ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మ్యాచ్ రద్దయితే ఏంటి పరిస్థితి?
సాధారణంగా ఏ ఐసీసీ టోర్నమెంట్ జరిగినా సెమీస్, ఫైనల్స్ మ్యాచ్ లకు రిజర్వ్ డేను ముందుగానే ప్రకటిస్తారు. తాజాగా జరుగుతున్న మహిళల సెమీస్ మ్యాచ్ కు సైతం రిజర్వ్ డేను నిర్ణయించారు. ఐసీసీ టోర్నమెంట్ షెడ్యూల్ ను ప్రకటించినప్పుడే సెమీస్ కు రిజర్వ్ డేగా అక్టోబర్ 31ని చేర్చారు. కాబట్టి పెద్ద వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. తిరిగి శుక్రవారం యధాతథంగా కొనసాగించేందుకు అవకాశముంది.
