Vande Bharat Sleeper: ‘వందే భారత్ రైలు’ దేశీయ రైల్వే ప్రయాణంలో (Indian Railways) సరికొత్త శకానికి నాంది పలికిందని చెప్పవచ్చు. అత్యాధునిక టెక్నాలజీ, మెరుగైన భద్రతా ప్రమాణాలు, సౌకర్యవంతమైన కోచ్‌లు, వేగవంతమైన ప్రయాణంతో రైలు ప్యాసింజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. అనతికాలంలో ‘వందే భారత్’ ట్రైన్ సేవలు దేశంలోని కీలకమైన మార్గాల్లో అందుబాటులోకి రాగా, త్వరలోనే ‘వందేభారత్ స్లీపర్’ (Vande Bharat Sleeper) కూడా పట్టాలెక్కబోతోంది. ఈ నెల డిసెంబర్ చివరిలో వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తోంది. అయితే, తొలుత ఢిల్లీ – పాట్నా మార్గంలో (Delhi – Patna Rail Route) సేవలను ప్రారంభించనున్నారు.
ఈ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే, రాత్రిపూట సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారిపై అలసటను గణనీయంగా తగ్గిస్తుంది. చారిత్రాత్మకం కాబోతున్న ఈ రైలు ప్రారంభోత్సవానికి రైల్వే శాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. చివరి దశ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో, ప్యాసింజర్లు త్వరలోనే సేవలను పొందనున్నారు. కాగా, బెంగళూరులోని బీఈఎంఎల్ (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) ఫ్యాక్టరీలో రెండు వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీని మొదలుపెట్టగా, ఇప్పటికే ఒకటి పూర్తిగా తయారైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదటి రైలు డిసెంబర్ 12న ఉత్తర రైల్వేకు బయలుదేరుతుందని సమాచారం. రైలు అక్కడికి చేరుకున్నాక ఢిల్లీ-పాట్నా రూట్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు.
Read Also- IND vs SA 2025 3rd ODI: వైజాగ్ వన్డేలో రాణించిన భారత బౌలర్లు.. టీమిండియా ముందు మోస్తరు టార్గెట్!
16 కోచ్‌లు.. 827 బెర్త్‌లు
వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. బెర్త్‌ల విషయానికి వస్తే మొత్తం 827 ఉంటాయి. ఇందులో థర్డ్ ఏసీ (3ఏ)- 611, సెకండ్ ఏసీ (2ఏ)- 188, ఫస్ట్ ఏసీ (1ఏ)- 24 ఉంటాయని అధికారులు చెప్పారు. ఇక, ఈ రైలు గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తయారు చేశారు. భద్రతకు సంబంధించిన ఫీచర్ల విషయానికి వస్తే, కవచ్ సిస్టమ్, క్రాష్ రెసిస్టెన్స్ స్ట్రక్చర్ వంటి అధునాతన సేఫ్టీ టెక్నాలజీలతో తయారు చేశారు. అవరసరాన్ని బట్టి కోచ్‌ల సంఖ్యను 24కి పెంచుకునే వెసులుబాటు ఉంటుంది.
Read Also- Sonia Gandhi: సోనియా గాంధీ అరుదైన స్పీచ్.. బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు
అధునాతన సౌకర్యాలు
వందే భారత్ స్లీపర్ ట్రైన్ లోపల అధునాతన సౌకర్యాలను కల్పించారు. ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. ఆటోమేటిక్‌గా వాటంతట అవే తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. ఈ ట్రైన్‌లో బయో టాయిలెట్లు (Bio toilets) ఉంటాయి. ఈ టాయిలెట్ల ద్వారా వ్యర్థాలను ప్రత్యేకంగా ప్రాసెస్ చేస్తారు, కాబట్టి టాయిలెట్ల నుంచి దుర్వాసన రాదు. ఇక, ఈ రైలులో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఎవరైనా చదుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా రీడింగ్ లైట్లు (Personal reading lights) కూడా ఉన్నాయి. కాగా, ఢిల్లీ- పాట్నా మార్గంలో వారానికి ఆరు రోజులు ఈ సర్వీసు నడిచే అవకాశం ఉంది. పాట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ‘తేజస్ రాజధాని’ మాదిరిగా సర్వీసు టైమింగ్స్ ఉంటాయని పేర్కొన్నారు.

