AirIndia Crash: గురువారం అహ్మదాబాద్‌లో ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (Air India Boeing 787-8 Dreamliner) మెయింటనెన్స్‌ను తుర్కియేకి చెందిన సంస్థ నిర్వహించిందంటూ వెలువడుతున్న ఊహాగానాలను ఆ దేశం ఖండించింది. తమ దేశానికి చెందిన సంస్థ ప్రమేయం లేదని ప్రకటన చేసింది. బోయింగ్ 787-8 ప్యాసింజర్ విమానం నిర్వహణను ‘టర్కిష్ టెక్నిక్’ (Turkish Technic) నిర్వహించిందనే సమాచారం తప్పు అని పేర్కొంది. ఈ మేరకు టర్కీ డైరెక్టరేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఫర్ కౌంటర్ డిస్‌ఇన్ఫర్మేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రమాదానికి గురైన విమానాన్ని (Air India Plane Crash) టర్కిష్ టెక్నిక్ నిర్వహించిందనే వాదన పూర్తిగా తప్పు. భారత్-తుర్కియే సంబంధాల పట్ల ఇరు దేశాల ప్రజలకు ఉన్న అభిప్రాయాలను తారుమారు చేసేలా ఈ ప్రచారం కనిపిస్తోంది’’ అని ఎక్స్ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Read this- MLC Kavitha: కవిత బీఆర్ఎస్ మధ్య గ్యాప్.. ఈ మౌనం దేనికి సంకేతం?
కాగా, లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో కూలిపోవడంతో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్యాసింజర్లు చనిపోయారు. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇక విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ కాంప్లెక్స్ ఆవరణలో కూడా పెను బీభత్సం జరిగింది. 33 మందికిపై మెడికల్ విద్యార్థులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు.
ఒప్పందం నిజమే
‘‘ఎయిరిండియా, టర్కిష్ టెక్నిక్ సంస్థ మధ్య 2024-25లో కుదిరిన ఒప్పందాల ప్రకారం, బీ777 మోడల్ వైడ్-బాడీ విమానాలకు ప్రత్యేక నిర్వహణ సేవలు అందించాల్సి ఉంది. అయితే, ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ఈ ఒప్పందం పరిధిలోకి రాదు. నేటి వరకు ఈ రకమైన ఏ ఎయిర్ ఇండియా విమానానికి టర్కిష్ టెక్నిక్ నిర్వహణ చేపట్టలేదు’’ అని వివరించింది. కుప్పకూలిన విమానం మెయింటనెన్స్ చేపట్టిన కంపెనీ గురించి తమకు తెలుసునని, అయితే, ఈ విషయంపై ప్రకటన చేయడం తమ పరిధికి మించి వ్యవహరించినట్టు అవుతుందని పేర్కొంది. అంతర్జాతీయ వేదికలపై తుర్కియే బ్రాండ్‌ల ఖ్యాతిని దెబ్బతీయడమే లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాలను సెంటర్ ఫర్ కౌంటర్ పర్యవేక్షిస్తుందని, అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఎయిరిండియా విమాన ప్రమాదంపై భారత ప్రజల బాధను తుర్కియే ప్రజలుగా తాము హృదయపూర్వకంగా పంచుకుంటామని ‘టర్కీ డైరెక్టరేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఫర్ కౌంటర్ డిస్‌ఇన్ఫర్మేషన్’ పేర్కొంది.
Read this- Gold Rate ( 15-06-2025): అతి భారీగా పెరిగి షాక్ ఇచ్చిన గోల్డ్.. ఎంత పెరిగిందంటే?
కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు తుర్కియే సంపూర్ణ మద్దతు ఇచ్చింది. దీంతో, భారతదేశంలోని 9 ప్రధాన విమానాశ్రయాలలో సేవలను అందించిన తుర్కియేకు చెందిన సెలెబి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘భద్రతా అనుమతులు’ కోల్పోయింది. ఈ మేరకు మే 15న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా తక్షణమే అనుమతులు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ పరిణామం జరిగిన దాదాపు ఒక నెల రోజుల ఎయిరిండియా విమానం కూలింది. దీంతో, టర్కిష్ టెక్నిక్‌పై అనుమానాలు వచ్చాయి. అందుకే, తుర్కియే ప్రభుత్వం నేరుగా ప్రకటన విడుదల చేసింది. కాగా, మే 8న భారతదేశంపై పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లలో ఎక్కువ భాగం టర్కీలో తయారు చేసిన ‘అసిస్‌గార్డ్ సోంగార్’, బేరక్తర్ టీబీ2 అని నిర్ధారణ అయ్యింది. దీంతో, తుర్కీయేను భారత్ వ్యతిరేకిస్తోంది. తుర్కియేకి వెళ్లకుండా చాలామంది భారతీయ పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు కూడా చేసుకున్నారు.