MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీ మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఎవరికి వారుగా ప్రజల్లోకి వెళ్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ పార్టీలో ఏర్పడిన అంతరాన్ని పూడ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అధినేత కేసీఆర్ సైతం కవిత చేసిన విమర్శలపై మౌనంగా ఉన్నారు. పార్టీలో ఎవరి మధ్య విభేదాలు లేవు, విమర్శలు ఎవరిపై ఎవరు చేయలేదన్నట్లుగా అసలు ఒకరికి ఒకరు పట్ఠించుకోనట్లుగా, ఏమీ జరగనట్లుగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతుండడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇందిరాపార్కు దగ్గర ధర్నా
ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని హాట్ కామెంట్ చేశారు. అంతేకాదు కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసు ఇవ్వడంపై పార్టీ స్పందించకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యచరణ చేపట్టకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లడంపైనా తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు దగ్గర ధర్నా సైతం చేపట్టారు. అంతేకాదు తాను జైలులో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన వస్తే తాను తిరస్కరించానని వ్యాఖ్యలు చేశారు. దానికి మాజీ మంత్రి హరీష్ రావు సైతం పరోక్షంగా విలీనంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాత పార్టీపై కవిత చేసిన విమర్శలపై చర్యలు తీసుకుంటారనే ప్రచారం జరిగింది.
పార్టీని డ్యామేజ్ చేసిన కవిత వ్యాఖ్యలు
అప్పటివరకు నేతలు ఎవరు మాట్లాడొద్దని పార్టీ అధిష్టానం సైతం ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 7న కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. కానీ పార్టీపై చేసిన విమర్శలపై స్పందించలేదు. కనీసం పిలిచికూడా కవితతో మాట్లాడకపోవడంపై పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. కవిత వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ అయ్యేలా ఉన్నాయని పార్టీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ గానీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ స్పందించలేదు. అంటే కావాలని కవితను దూరం పెడుతున్నారా? లేకుంటే రాజకీయ వ్యూహంలో భాగంగానే పార్టీ అధినాయకత్వం సైలెంట్ గా ఉందా ? అనేది కూడా చర్చజరుగుతుంది.
Also Read: Leopard: సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం.. బయాందోళనలో గ్రామస్తులు
కేటీఆర్ మద్దతు
విదేశీ పర్యటనకు ముగించుకొని వచ్చిన తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూశారు. ఆయన సైతం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సైతం దుయ్యబట్టారు. ఈ 9న హరీష్ రావు కాళేశ్వరం విచారణ సమయంలోనూ భవన్ కు వచ్చి కేటీఆర్ మద్దతు తెలిపారు. నేతలతోనూ భేటీ అయ్యారు. నల్లగొండ, ఖమ్మం పర్యటనకు కేటీఆర్ వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈ నెల 11న కేసీఆర్ హాజరయ్యారు. అదే రోజు ఉదయం ఎర్రవెల్లిలోని నివాసంలో కేసీఆర్ ను హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురు కలిశారు. కొద్దిసేపు చర్చించారు. కానీ కవిత ఇష్యూపై అసలు ఎవరు మాట్లాడలేదని తెలిసింది. ఆ తర్వాత హరీష్ రావు, కేటీఆర్ బీఆర్కే భవన్ కు రాగా, కవిత మాత్రం రాలేదు. పార్టీ కార్యక్రమాలపైన కంటే జాగృతిపైనే కవిత ఎక్కువ దృష్టిసారించినట్లు ఆమె కార్యక్రమాలే స్పష్టం చేస్తున్నాయి.
జాగృతికి చెందిన కేడర్ మాత్రమే..
కవిత దృష్టినంతా పార్టీపై కాకుండా సొంత సంస్థ జాగృతిపైనే పెట్టారు. పార్టీ కార్యక్రమాలు ఎక్కడా నిర్వహించిన దాఖలాలు లేవు. కేవలం వ్యక్తిగత ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. జాగృతి సంస్థ కమిటీలు, మరోవైపు చేరికలు, జిల్లాల పర్యటనలలోనూ జాగృతి కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పార్టీ కేడర్ ఆమె కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. నాయకులు సైతం ఇదివరకు కవిత ఏ జిల్లాకు వెళ్లినా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికే వారు కానీ, కవిత పార్టీపై, కేటీఆర్ పై విమర్శల తర్వాత అంతా దూరమయ్యారనేది స్పష్టమవుతోంది. కేవలం జాగృతికి చెందిన కేడర్ మాత్రమే కనిపిస్తున్నారు. మరోవైపు బీసీ అంశంతో ముందుకెళ్తుండటంతో, రిజర్వేషన్లపై గళం వినిపిస్తుండటంతో ఆయా సంఘాలు మాత్రం ఆమెకు సంఘీభావం తెలుపుతున్నాయి.
ఈ-కార్ రేసులో ఏసీబీ నోటీసులు
కేటీఆర్ ఎక్కడ సైతం కవిత అంశం లేవనెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ కవిత చేసిన విమర్శలపై ఎక్కడ మాట్లాడటం లేదు. అందుకు మీడియా కు సైతం అవకాశం ఇవ్వడంలేదు. అసలు పార్టీలో ఏం జరుగలేదు. పార్టీ నేతల మధ్య అంతరం లేదు. ఎవరు విమర్శలు చేయడంలేదు అన్నంత ఈజీగా కవిత చేసిన వ్యాఖ్యలను తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కవితకు అసలు పార్టీలో ఓ నేతనే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారనే కేటీఆర్ అనుసరిస్తున్న విధానంలో తేటతెల్లమవుతోంది. ఈ తరుణంలోనే కేటీఆర్ కు ఫార్మూలా ఈ కారురేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై కవిత స్పందించారు. నోటీసులపై, ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కవిత స్పందించడంపై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి.
Also Read: Case on KTR: కేటీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో కేసు నమోదు.. ఎందుకంటే?
తాజా బనకచర్ల ప్రాజెక్టుపై..
హరీష్ రావు సైతం కవిత వ్యాఖ్యలను లైట్ గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన పని ఆయన చేసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. మొన్న కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్, తాజా బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎవరికి వారుగా ముందుకు వెళ్తున్నారు తప్ప పార్టీలో అంతరాన్ని పూడ్చేందుకు ఎవరు చొరవ తీసుకోవడం లేదు. కేవలం అదికుటుంబ సభ్యుల మధ్య సమస్యగానే చిత్రీకరిస్తూ అంశాన్ని పక్కనబెడుతున్నారా? అనేది కూడా చర్చజరుగుతుంది.
ఆసుపత్రికి కవిత దూరం
ఇదెలా ఉంటే నందినగర్ లో కేసీఆర్ మరో మూడ్రోజులు ఉండబోతున్నారు. హెల్త్ చెకప్ కోసం ఎర్రవెల్లి నుంచి వచ్చారు. గత రెండు రోజులుగా ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకొని వస్తున్నారు. కవిత వెళ్లలేదు. ఎప్పుడు అయినా తండ్రి మెడికల్ చెకప్ కు వస్తే వెన్నంటి ఉండేది. అయితే ఇప్పుడు దూరంగా ఉన్నారనేది చర్చజరుగుతుంది. కేసీఆర్ కోపంగా ఉండటంతోనే వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతుంది. మా నాన్నకు రొటీన్ చెకప్.. అని మీడియాతో కవిత పేర్కొన్నారు.ఇంతకు కవిత వెళ్తారా? లేదా? అనేది చూడాలి. ఆమె వెళ్తే వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. లేకుంటే మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు.
Also Read: MLC Kavitha: సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థులు నడుం బిగించాలి