Arunachal Pradesh Accident: అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో (Arunachal Pradesh Accident) అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తూ ఓ లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న మొత్తం 22 మంది కార్మికులు మరణించినట్లు పోలీసులు, జిల్లా అధికారులు ధృవీకరించారు. నిజానికి మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 8న రాత్రి సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, సంక్లిష్టమైన భూభాగం, ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ కూడా పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హయులియాంగ్-చాగ్లగామ్ రోడ్డు మార్గంలో భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న మెటెంగ్లియాంగ్ ప్రాంతంలో జరిగింది. ప్రమాదానికి గురైన ట్రక్కు సుమారు 1000 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది.
ఒక్కరే బతికారు…
ఈ ఘోర ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణించిన కూలీల్లో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అతడికి కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి. గాయపడిన ఆ వ్యక్తి డిసెంబర్ 10న సమీపంలోని బోర్డర్ రోడ్స్ టాస్క్ ఫోర్స్ (BRTF) శిబిరాన్ని చేరుకుని సమాచారం అందించడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. గాయపడిన ఆ వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం అస్సాంకు తరలించారు. ఇక, మృతులంతా అసోంలోని టిన్సుకియా జిల్లా గిలాపుకురి టీ ఎస్టేట్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. వీరంతా అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మాణ పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఇండియన్ ఆర్మీ (స్పియర్ కార్ప్స్), ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, జిల్లా యంత్రాంగం, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సిబ్బంది, అధికారులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు.
Read Also- Modi – Trump: కీలక పరిణామం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
ప్రమాదం జరిగిన స్థలం అత్యంత ఏటవాలుగా ఉంటుందని, ఆ రోడ్డు కూడా చాలా ఇరుకుగా, ఆ ప్రాంతంలో దట్టమైన చెట్లతో సంక్లిష్టమైన ప్రాంతంగా ఉంటుందని అధికారులు వివరించారు. దీంతో, మృతదేహాల వెలికితీత సహాయక బృందాలకు పెద్ద సవాలుగా మారిందని అంటున్నారు. ఇప్పటివరకు 17 మృతదేహాలను వెలికితీశామని అధికారులు ధృవీకరించారు. మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, వెలికితీసిన మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించి, మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్టు వెల్లడించారు.
ఈ ఘటనపై అంజావ్ డిప్యూటీ కమిషనర్ మిలో కొజిన్ మీడియాతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో కఠినమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఇరుకైన రోడ్ల కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని అన్నారు. అయితే, ఇప్పుడు జరిగిన ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఏంటనేది తెలియదని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.
తీవ్ర బాధాకరం: రాహుల్ గాంధీ
అరుణాచల్ ప్రదేశ్‌లో లోయలో ట్రక్కు బోల్తా పడి కార్మికులు దుర్మరణం చెందారనే వార్త తీవ్ర బాధాకరమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కార్మికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. గల్లంతైన వారిని వీలైనంత త్వరగా గుర్తించాలన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
Read Also- GHMC BJP: జీహెచ్‌ఎంసీలో వార్డుల డీలిమిటేషన్‌పై భగ్గుమన్న బీజేపీ.. అభ్యంతరాలు ఇవే

