Modi – Trump: భారత్ – అమెరికా మధ్య సంబంధాలు సన్నగిల్లిన వేళ ఇరుదేశాధి నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Modi – Trump) కీలక చర్చలు జరిపారు. ఇరువురి మధ్య గురువారం టెలిఫోన్ సంభాషణ జరిగింది. భారత్-అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం ఖరారు అవ్వొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఇరుదేశాధినేతలు మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పరస్పర సహకారంపై చర్చ
ఇరుదేశాల మధ్య వివిధ రంగాలలో సహకారాన్ని విస్తరించుకోవడంపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చించారు. భారత్-అమెరికా భాగస్వామ్యంలో పురోగతిని కూడా సమీక్షించారు. వాణిజ్యం, కీలకమైన టెక్నాలజీలు, ఇంధనం, రక్షణ, భద్రతతో పాటు ముఖ్య రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై ఇరువురు మాట్లాడారు. అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారం బలోపేతం అవుతుండడంతో ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకించి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉమ్మడి ప్రయత్నాలలో వేగానికి ప్రాముఖ్యత ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.
ఉమ్మడి లక్ష్యాలు సాధించడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి కలిసి కృషి చేయాలని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారంటూ ప్రకటనలో పేర్కొన్నారు. 21వ శతాబ్దపు భారత్ – అమెరికా ‘కాంపాక్ట్’ (COMPACT – Catalysing Opportunities for Military Partnership, Accelerated Commerce and Technology) అమలుకు సహకారాన్ని పెంపొందించుకోవాలని ప్రకటించారు.
Read Also- Samantha and Raj: సమంత-రాజ్ నిడిమోరుల పెళ్లిపై అరుదైన ఫొటోతో రాజ్ సోదరి షీతల్ పోస్ట్ వైరల్..!
ప్రధాని మోదీ ట్వీట్
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సంభాషణపై ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ట్రంప్‌తో హృదయపూర్వకమైన, ఆసక్తికరమైన చర్చ జరిగిందన్నారు. ‘‘ అధ్యక్షుడు ట్రంప్‌తో చాలా హృదయపూర్వకమైన, చక్కటి సంభాషణ జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిపై సమీక్ష జరిపాం. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను చర్చించాం. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసి పనిచేయడాన్ని కొనసాగిస్తాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే, తన ట్వీట్‌లో వాణిజ్య అంశాన్ని మోదీ ప్రస్తావించలేదు.
Read Also- Mowgli Producer: సెన్సార్ బోర్డ్ ఆఫీసర్‌పై బండి సరోజ్ షాకింగ్ కామెంట్స్.. సారీ చెప్పిన నిర్మాత!
సంబంధాలు దెబ్బతిన్న వేళ..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని తప్పుబడుతూ భారత్‌పై అమెరికా ఈ ఏడాది జులైలో భారీ సుంకాలు ప్రకటించింది. ప్రకటించిన సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పటినుంచి యూఎస్-భారత్ మధ్య సంబంధాలు కొంత సన్నగిల్లాయి. ఈ సుంకాలు అన్యాయమని, వాటి వెనుక ఉన్న లాగిక్ అర్థంలేదని భారత్ పదేపదే వ్యతిరేకించినప్పటికీ, అమెరికా వెనక్కి తగ్గలేదు.
మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో ఉన్నత స్థాయి పర్యటన జరిపిన కొద్ది రోజుల తర్వాత మోదీ-ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరగడం గమనార్హం. పుతిన్ పర్యటనలో భారత్ – రష్యా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. మోదీ – పుతిన్ మధ్య మైత్రి ప్రతిఒక్కరి దృష్టిని ఆకట్టుకుంది. విమానాశ్రయంలో స్వాగతం పలకడం దగ్గర నుంచి, ఒకే కారులో ప్రయాణించడం, ఆతిథ్యం ఇవన్నీ పుతిన్ పర్యటనలో ప్రత్యేకంగా నిలిచాయి.

