Indigo CEO Apology: విమానయాన సంస్థ ఇండిగో (Indigo) ప్రతి రోజూ వందలాది సంఖ్యలో విమానాల రద్దు, ఆలస్యాలతో ప్యాసింజర్లను తీవ్ర ఇబ్బందులు పెట్టిన విషయం తెలిసిందే. ఇంత జరిగినా కేంద్రప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని, మోదీ సర్కారు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యహరిస్తోందంటూ వ్యక్తమవుతున్న విమర్శలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన కార్యాలయంలో ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ చేతులు జోడించి క్షమాపణలు (Indigo CEO Apology) కోరారని వెల్లడించారు. ఆ క్షమాపణ కేవలం తనకు మాత్రమే చెప్పలేదని, దేశ ప్రజలందరినీ ఆయన క్షమాపణలు కోరారని రామ్మోహన్ నాయుడు వివరించారు. పీటర్ ఎల్బర్స్ రెండు చేతులు జోడించి క్షమాపణ చెబుతున్న ఓ ఫొటోను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. వైరల్‌గా మారిన ఆ ఫొటో వెనుక నిజమైన కథేంటని ఓ జాతీయ సంస్థ ప్రశ్నించగా, కేంద్ర మంత్రి ఈ సమాధానం ఇచ్చారు.
Read Also- Rahul Vs Amit Shah: ఒత్తిడిలో అమిత్ షా.. చేతులు వణికాయ్.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో సభలో దుమారం
ఇండిగో సీఈవో ఎల్బర్స్.. తన కార్యాలయానికి వచ్చి క్షమాపణ చెప్పడాన్ని ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనమనే వ్యాఖ్యలను మంత్రి రామ్మోహన్ నాయుడు ఖండించారు. తాము ప్యాసింజర్ల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని పనిచేస్తున్నామని వివరించారు. ఇండిగో విమాన కార్యకలాపాల్లో ఇంకా తీవ్ర అంతరాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు పీటర్స్ ఎల్బర్స్‌ను మీటింగ్‌కి పిలిపించారు. ఈ భేటీలో ఎయిర్‌లైన్ కార్యకలాపాల స్టేటస్, సాధారణ స్థితికి చేరుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. అలాగే, రిఫండ్స్, బ్యాగేజ్ అంశాలపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్యాసింజర్ల కోసం తీసుకుంటున్న చర్యలు ఏమిటో చెప్పాలని కోరారు. వివరాలన్నీ తెలుసుకున్న కేంద్రమంత్రి.. ఇండిగో విమాన సర్వీసుల్లో 10 శాతం మేర తగ్గించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
Read Also- IndiGo: సంచలన నిర్ణయం తీసుకున్న ఇండిగో.. ప్రయాణికులకు రూ.10,000 ట్రావెల్ వోచర్లు
సమస్య ఇండిగోదే: రామ్మోహన్ నాయుడు
విమాన సర్వీసుల్లో ఈ గందరగోళ పరిస్థితులకు ఇండిగో ఎయిర్‌లైన్సే కారణమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సంస్థ నిర్వహణ కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమైందనేది తాను స్పష్టంగా చెప్పదలుచుకున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇండిగో సంస్థ తీవ్రమైన నిర్వహణ లోపాలకు తావిచ్చిందని అన్నారు. బుధవారం నాటికి ఇండిగో సేవలు కాస్త నిలకడగా ఉన్న విషయం తెలిసిందేనని, ఇంతకుముందులా పెద్ద సంఖ్యలో విమానాల రద్దులు లేకపోయినప్పటికీ, విమాన సర్వీసులపై ప్యాసింజర్లలో ఇంకా ఆందోళన కొనసాగుతోందని చెప్పారు. ఈ ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇండిగో కారణంగానే ఈ సంక్షోభం వచ్చిందని, కొత్త నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సిబ్బంది రోస్టరింగ్ వ్యవస్థను సిద్ధం చేసుకోలేదని విమర్శించారు. ఈ కారణంగానే డిసెంబర్ 3 – 4 తేదీలలో విమాన సర్వీసులు వందలాది సంఖ్యలో రద్దయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

