Bihar Manifesto: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ‘చావోరేవో’ సమరంగా భావిస్తున్న విపక్ష ఆర్జేడీ పార్టీ (RJD Party), గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో అస్త్రశస్త్రాలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలో మంగళవారం (అక్టోబర్ 28) కీలకమైన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. మహా కూటమితో (Mahagathbandhan) కలిసి విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో పలు ముఖ్యమైన హామీలను పేర్కొంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ మహాకూటమి వాగ్దానం చేసింది. మేనిఫెస్టోలో పేర్కొన్న మొదటి అంశం ప్రకారం, అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ప్రతి కుటుంబంలోని ఒక సభ్యుడికి ఉద్యోగ నియామక పత్రం ఇస్తామని పేర్కొంది.
‘న్యాయ్, రోజ్‌గార్ ఔర్ సమ్మాన్’ ప్రధానాధారంగా మేనిఫెస్టోను రూపొందించారు. న్యాయం, ఉపాధి, గౌరవం అంశాలను మూలంగా తీసుకున్నారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, కుల గణన, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, మెరుగైన శాంతిభద్రతలు, వక్ఫ్ బిల్లు రద్దు చేస్తామంటూ పలు హామీలను గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోపు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తామన్నారు. ఉపాధి కమిషన్ ద్వారా, మూసివేసిన పరిశ్రమలను పునరుద్ధరించడం ద్వారా, ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు మేనిఫెస్టోలో వివరించారు.
Read Also- Cyclone Montha: తుపాను అంటే వాన, గాలి కాదు.. దాని వెనుక అణుబాంబులు, భూకంపాలకు మించిన శక్తి!
మరోవైపు, వలస కార్మికులను ట్రాక్ చేయడానికి కార్మికుల గణన కూడా చేపడతామని హామీ ఇచ్చారు. వలస కార్మికుల సంక్షేమం, బీమా పాటుపడతామన్నారు. బీహార్‌లోనే ఉద్యోగావకాశాలు కల్పించేలా డాక్యుమెంట్ తయారు చేస్తామన్నారు. మరోవైపు, చిన్న, సన్నకారు రైతులకు రుణమాఫీ, నీటిపారుదల కోసం ఉచిత విద్యుత్, పంటలకు జాతీయ స్థాయి కంటే అధికంగా కనీస మద్దతు ధర అందిస్తామని హామీలు ఇచ్చారు.
ఈ మేనిఫెస్టోలో ఉద్యోగాల హామీ ప్రధానాంశంగా కనబడింది. తేజస్వి యాదవ్ ఓటర్లకు ఇస్తున్న ప్రధాన హామీ ఉద్యోగాలు అని పేర్కొన్నారు. పేద అక్కలను (Jeevika Didis) శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. అంతేకాదు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని వాగ్దానం చేశారు. పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకొస్తామని ప్రస్తావించారు. ప్రతిపక్ష మహాకూటమి బీహార్‌లో మొట్టమొదటిగా ఎన్నికల మేనిఫెస్టో (Bihar Manifesto) విడుదల చేసినట్టు అయింది. రాష్ట్రంలోని నిషేధిత చట్టాల నుంచి తాటికల్లుకు మినహాయింపు ఇస్తామని ఆర్జేడీ చీఫ్ తేజశ్వి యాదవ్ చెప్పారు. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో బీహార్‌లో మద్యం తయారీ, అమ్మకం, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. ఈ నేపథ్యంలో తాటి కల్లుకు అధికారికంగా అనుమతి ఇస్తామని తెలిపారు. ఈ మేరకు సారన్ జిల్లాలోని పర్సాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
Read Also- Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్
