Harish Rao Father Death: బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలకతీతంగా రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. హరీశ్ రావుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ధైర్యం చెబుతూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం సత్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్ స్వయంగా సత్యనారాయణ భౌతకకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
బావకు కేసీఆర్ నివాళులు..
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వయంగా హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన తన్నీరు సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించి పార్ధివ దేహానికి నమస్కరించారు. అనంతరం హరీశ్ రావుతో పాటు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అంతకుముందు కేసీఆర్ సతీమణి శోభమ్మ సైతం హరీశ్ రావు ఇంటికి చేరుకొని.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా కేసీఆర్ 7వ సోదరి, అక్క లక్ష్మీకి సత్యనారాయణ భర్త కావడం గమనార్హం.
మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత @BRSHarish గారి తండ్రి.. తన బావ గారైన తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ pic.twitter.com/PcN31vtJdz
— BRS Party (@BRSparty) October 28, 2025
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారి తండ్రి సత్యనారాయణ గారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సతీమణి శోభమ్మ pic.twitter.com/dlasBgxWCI
— BRS Party (@BRSparty) October 28, 2025
సీఎం రేవంత్ సంతాపం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. హరీశ్ రావు (Harish Rao) తండ్రి మరణంపై సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘మాజీ మంత్రి, సిద్ధిపేట శాసన సభ్యుడు తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని సీఎం రేవంత్ రాసుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్.. స్వయంగా సత్యనారాయణ భౌతికకాయాన్ని దర్శించి నివాళులు అర్పించారు. హరీశ్ రావును కలిసి ధైర్యం చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం.. సత్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మాజీ మంత్రి, సిద్ధిపేట శాసన సభ్యుడు శ్రీ తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— Revanth Reddy (@revanth_anumula) October 28, 2025
Also Read: Bigg Boss Telugu: కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు.. ఫేక్ రిలేషన్స్ పెట్టుకోలేదు.. ప్రోమోలో భరణి వైల్డ్ ఫైర్!
కల్వకుంట్ల కవిత స్పందన
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సైతం హరీశ్ రావు తండ్రి మరణంపై స్పందించారు. ‘మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఉదయం నుంచి బావ హరీశ్ రావుతోనే ఉన్నారు. సత్యనారాయణ రావు భౌతిక కాయం వద్దనే నిలబడి హరీశ్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో స్థైర్యాన్ని నింపారు.
మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను.
సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 28, 2025
