Cyclone Montha: సముద్రం, ఆకాశం, భూమిని కలగలిపే అత్యంత శక్తివంతమైన ప్రకృతి శక్తి రూపాలే తుపానులు (Cyclones). వీటి కారణంగా సంభవించే వర్షాలు, ఈదురు గాలులు మనుషులతో పాటు ఇతర జీవరాశులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. కేవలం ఒకే తుపాను కొన్ని రాష్ట్రాలపై, తీవ్రత బట్టి కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ దేశాలపై సైతం ప్రభావం ఉంటుంది. ఇంతలా ఎఫెక్ట్ చూపిస్తున్న తుపాన్ల వెనుక ఎంత శక్తి దాగి ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మొంథా తుపాను (Cyclone Montha) నేపథ్యంలో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
తుపాను ఎలా ఏర్పడుతుంది?
తుపాను అంటే కేవలం గాలి, వర్షం కాదు. దాని వెనుక ‘ఉష్ణ శక్తి’ ఉంటుంది. తుపాను పుట్టుక వెనుక ఒక భౌతిక శాస్త్ర అద్భుతం దాగి ఉంటుంది. వెచ్చని సముద్ర జలాలపై తుపానులు ఏర్పడతాయి. వెచ్చని తేమతో కూడిన గాలి పైకి లేచినప్పుడు, కింద అల్పపీడన ప్రాంతం (Low-Pressure Area) ఏర్పడుతుంది. అల్పపీడనం అంటే, వాతావరణంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంటే గాలి ఒత్తిడి (Air Pressure), చుట్టుపక్కల ప్రాంతాల కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి, అల్పపీడనం ఏర్పడిన ప్రాంతంలోకి అధిక పీడనం ఉన్న వాయువులు సులభంగా ప్రవేశిస్తాయి. వేగంగా దూసుకొస్తాయి. అల్ప పీడన ప్రాంతంలో నిండుకునే సమయంలో ఆ వాయువులు సుడులు తిరుగుతాయి. వాయువులు ఈ విధంగా గుండ్రంగా తిరగడంతో వేడి పుట్టి నిరంతరం శక్తి వెలువడుతుంది. అది క్రమంగా తీవ్రమవుతుంది. గాలి సుడులు తిరిగే వేగం గంటకు 39 మైళ్లకు (63 కి.మీ) చేరినప్పుడు దానిని ఉష్ణమండల తుపానుగా (Tropical Storm), 74 మైళ్లకు (119 కి.మీ) పెరిగినప్పుడు ‘ఉష్ణమండల తుపాను’గా (Tropical Cyclone) వర్గీకరిస్తారు.
Read Also- Cyclone Montha: మొంథా అంటే అర్థం ఏమిటి? ఈ పదాన్ని ఎవరు సూచించారో తెలుసా?
వెచ్చని గాలి పైకి లేచి..
తుపాన్ల నుంచి వెలువడే శక్తిని గుప్త ఉష్ణం (latent heat) అని వ్యవహారిస్తుంటారు. సముద్రంపై పేరుకుపోయిన అదనపు వేడి వాతావరణంలోకి చేరి సాధారణంగా భూమి చల్లబడుతుంది. సముద్ర ఉపరితల వేడి 26 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు, నీటి బిందువులు ఆవిరై గాలిలోకి లేస్తాయి. ఈ ఆవిరిలో సూర్యుని నుంచి గ్రహించిన భారీ ‘గుప్త ఉష్ణం’ నిక్షిప్తమై ఉంటుంది. ఇది సాధారణ వేడి కాదు. ప్రతి బిందువు తనలో కొంత శక్తిని దాచుకుంటుంది. ఈ వేడి గాలి పైకి లేచి, చల్లబడి, నీటి ఆవిరి తిరిగి ద్రవంగా మారినప్పుడు.. బిందువులలో దాగి ఉన్న గుప్త ఉష్ణం వాతావరణంలోకి విడుదలవుతుంది. వెలువడిన ఈ వేడి చుట్టూ ఉన్న గాలిని మరింత వేడెక్కిస్తుంది. దీంతో, అది మరింత పైకి లేచి, అల్ప పీడనాన్ని ఇంకాస్త పెంచుతుంది. ఈ ప్రక్రియ ఒక చక్రంలా మారి, మరింత వేడి గాలిని సముద్రం నుంచి పైకి లేచి, భయంకరమైన తుపానుగా రూపాంతరం చెందుతుంది.
Read Also- CYCLONE MONTHA: మరికొన్ని గంటల్లోనే ‘మొంథా తుపాను’ బీభత్సం.. ఈ ఏరియాల్లో ఉండేవారికి బిగ్ అలర్ట్
తుపాన్లలో అణుశక్తి!
ఒక తుపాను విడుదల చేసే శక్తి ఏ స్థాయిలో ఉంటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్క సెకనుకు ఏకంగా 10 ట్రిలియన్ వాట్స్ (Watts) శక్తిని పుట్టిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న విద్యుత్ ఉత్పత్తి కంటే ఏకంగా 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదే గంటల లెక్కల్లో చూసుకుంటే, ఒక గంటకు ఏకంగా 36 క్వాడ్రిలియన్ జూల్స్ (Joules) శక్తిని పుట్టిస్తుంది. అంటే, ఒక భారీ పవర్ ప్లాంట్ ఒక ఏడాదిపాటు ఉత్పత్తి చేసే శక్తి కంటే కూడా అధికంగా ఉంటుంది. రోజువారీగా చూస్తే 24 గంటల్లో 2,400 ట్రిలియన్ వాట్స్ శక్తి వెలువడుతుంది. సగటున ఒక రోజుకు ప్రపంచంలోని మొత్తం మానవజాతి ఉపయోగించే విద్యుత్ శక్తి కంటే 200 రెట్లు అధికంగా ఉంటుంది.
అదే అణుబాంబులతో పోల్చితే, ఒక మధ్యస్థాయి తుపాను ఒక రోజులో విడుదల చేసే మొత్తం శక్తి, రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై వేసిన అణు బాంబు పేలుళ్ల శక్తికి లక్షల రెట్లు సమానమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అదే భూకంపంతో సరిపోల్చితే, ఒక రోజులో ఒక తుపాను విడుదల చేసే మొత్తం శక్తి, రిక్టర్ స్కేల్‌పై 8.0 తీవ్రత ఉన్న ఒక భారీ భూకంపం విడుదల చేసే శక్తికి సుమారుగా సమానంగా ఉంటుందని అంచనాగా ఉంది.
