Supreme Court: దేశరాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోట వద్ద సోమవారం రాత్రి జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో, సుప్రీంకోర్టులో (Supreme Court) మంగళవారం అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. జనాలను రెచ్చగొట్టే, లేదా హింసాత్మక చర్యలకు ప్రేరేపించే పదార్థాలను కలిగివుండడంతో, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ సందర్భంగా కీలకమైన సందేశాన్ని వెలువరించింది.
నిందితుడు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ మంగళవారం నాడు విచారణకు వచ్చింది. నిందితుడు తరపు న్యాయవాది తన వాదన మొదలుపెడుతూనే ‘నిన్నటి ఘటన (ఢిల్లీ బ్లాస్ట్) తర్వాత ఈ కేసును వాదించేందుకు ఇది సరైన ఉదయం కాదేమో’ అని వ్యాఖ్యానించారు. న్యాయవాది వ్యాఖ్యలపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఆసక్తికరంగా స్పందించింది. ‘సుస్పష్టమైన సందేశం పంపడానికి ఇదే అత్యుత్తమ ఉదయం’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. తద్వారా నిందితుడికి బెయిల్ నిరాకరించింది. సోమవారం రాత్రి ఎర్రకోట దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
Read Also- OYO Room Suicide: ఓయో రూమ్‌లో యువకుడు సూసైడ్.. మరణానికి ముందు తండ్రికి ఫోన్.. ఏం చెప్పాడంటే?
నిందితుడి నుంచి కేవలం ఇస్లామిక్ సాహిత్యం మాత్రమే స్వాధీనం చేసుకున్నారని న్యాయవాది సమర్థించే ప్రయత్నం చేసినప్పటికీ, నిందిత వ్యక్తి ‘ఇస్లామిక్ స్టేట్’ జెండాను పోలివున్న జెండాతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో మెంబర్‌గా ఉన్నాడని ధర్మాసనం గుర్తించింది. నిందితుడి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న సామాగ్రి స్వభావం, నిందితుడి ఆన్‌లైన్ లింకులు ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిరంతరం కస్టడీలో ఉంచడానికి అర్హమైనవేనని స్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ స్పష్టం చేసింది.
వెలుగులోకి మరో సీసీ ఫుటేజీ
ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా, హ్యుందాయ్ ఐ20 కారు ప్రయాణాన్ని ట్రేస్ చేయడంపై అధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో మరో కొత్త సీసీ ఫుటేజీ లభ్యమైంది. బదర్పూర్ టోల్ ప్లాజా వద్ద ఈ మూమెంట్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అయితే, అనుమానితుడు మొహమ్మద్ అమర్ మాస్కును ధరించి కారు నడిపాడు. నల్లటి రంగు మాస్కు పెట్టుకొని డ్రైవింగ్ చేసినట్టు ఆ వీడియోలో స్పష్టమైంది. సోమవారం ఉదయం 8.13 గంటల సమయంలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. టోల్ ప్లాజా వద్ద రశీదు తీసుకునే సమయంలో కూడా మాస్క్ తీయలేదు. ఈ టోల్ ప్లాజా హర్యానా, ఢిల్లీ సరిహద్దులో ఉంటుంది. అంతకుముందు ఉదయం 7.30 గంటల సమయంలో ఫరీదాబాద్‌లోని ఏసియన్ హాస్పిటల్ వద్ద కారు కదలికలను గుర్తించారు. ఉదయం 8.13 గంటలకు బదర్‌పూర్ టోల్ ప్లాజాను క్రాస్ చేయగా, 8.20 గంటలకు ఓక్లా ప్రాంతంలో కనిపించింది.
Read Also- Delhi Blast: ఎవరీ అహ్మద్ మాలిక్?.. బ్యాంకు సెక్యూరిటీ గార్డుకి, ఢిల్లీ పేలుడుకు సంబంధం ఏంటి?
