Renuka Chowdhury: పార్లమెంట్ శీతకాల సమావేశాలు ( Parliament Winter Session) ప్రారంభమైన సోమవారం నాడు ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి (Renuka Chowdhury) అందరినీ ఆశ్చర్యపరుస్తూ, తన కారులో ఓశునకాన్ని వెంటబెట్టుకొని పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ కుక్కని తిరిగి వెంటనే తన కారులో ఇంటికి పంపించినప్పటికీ, శునకాన్ని పార్లమెంట్‌కు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అరుదైన ఘటన కావడంతో పార్లమెంటరీ ప్రోటోకాల్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి.
రేణుకా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు
శునకాన్ని తీసుకొని పార్లమెంట్‌కు రావడం ఒక ఎత్తైతే, రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. శునకాన్ని తీసుకురావడంపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ, కరిచేవాళ్లు లోపలే ఉన్నారని అన్నారు. చట్టసభ్యులు కుక్కతో పార్లమెంట్‌కు రాకూడదంటూ నిషేధం ఏమైనా ఉందా? అని ఆమె ఎదురు ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఏంటి? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌కు వచ్చేదారిలో ఒక ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఈ కుక్క కనిపించిందని, అది ఏ కారు కింద పడిపోతుందేమోనన్న, దాన్ని కారులోకి ఎక్కించి, ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పారు. ఆ తర్వాత దానిని ఇంటికి పంపించానని అన్నారు. ఒక జంతువు ప్రాణాన్ని రక్షించడాన్ని ఎవరైనా తప్పుబడతారా? అని ఆమె మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. కరిచేవాళ్లు పార్లమెంట్‌లో కూర్చుని మరీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, మరి ఆ విషయంలో సమస్య లేదా? అని రేణుకా చౌదరి అన్నారు. ఇదివరకు కూడా తాను వీధుల్లోని అనేక దేశీ జాతి కుక్కలను దత్తత తీసుకున్నానని ఆమె ప్రస్తావించారు.
Read Also- Modi vs Priyanka: ప్రధాని మోదీ వర్సెస్ ప్రియాంక గాంధీ.. మాటల తూటాలు.. మోదీ ఏమన్నారో తెలుసా?
బీజేపీ ఎంపీల అభ్యంతరం
ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీలు తప్పుబట్టారు. ఎంపీలు, మంత్రులతో కుక్కను పోల్చుతూ మాట్లాడడాన్ని వ్యతిరేకించారు. రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఎంపీలకు, పార్లమెంట్‌కు అవమానకరమని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి శునకాన్ని తీసుకొచ్చానని చెప్పడం ఒక నాటకమని, పార్లమెంట్‌ను ఆమె అవమానించారని విమర్శించారు. బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ, కాంగ్రెస్ ఎంపీ తన తోటి ఎంపీలు, పార్లమెంటరీ సిబ్బంది మొత్తాన్ని ఒక కుక్కతో పోల్చారని, ఆమె దృష్టిలో ఎంపీలు, ఇతర సిబ్బంది అంతా కుక్కలతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కను పార్లమెంట్‌కు తీసుకురావడమే కాకుండా, అడిగితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో కూడా ఆమె ‘ఆపరేషన్ మహాదేవ్’, ‘ఆపరేషన్ సింధూర్’లను ఎగతాళి చేశారని, జవాన్లను అవమానిస్తూ మాట్లాడారని ఎంపీ పూనావాలా పేర్కొన్నారు.
Read Also- Samantha Rumours: వైరల్ అవుతున్న సమంత ఫోటోల్లో నిజమెంత.. ఆ ఫోటోలు ఎక్కడివంటే?
సమావేశాలు రేపటికి వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే, ఓటర్ల జాబితా సవరణ, ఢిల్లీ కాలుష్యంతో పాటు పలు సమస్యలపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో, కొద్దిసేపు తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఎంతసేపటికీ సద్దుమణగకపోవడంతో, సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పున:ప్రారంభమైనప్పటికీ, విపక్ష సభ్యులు దారికి రాకపోవడంతో మంగళవారం సభను వాయిదా వేస్తూ సభాపతి నిర్ణయం తీసుకున్నారు.
