Collector Rahul Raj: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అనుసరించాల్సిన ప్రచార నియమ నిబంధనలపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (Collector Rahul Raj) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రశాంత వాతావరణాన్ని, నిబంధనల పట్ల పారదర్శకతను పాటించాలని ఆయన అభ్యర్థులకు సూచించారు.
బహిరంగ సభలకు అనుమతి
ప్రచారం నిమిత్తం అభ్యర్థులు పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవడానికి, ర్యాలీలు నిర్వహించడానికి లేదా మైకులు పెట్టుకోవడానికి సంబంధిత మండల తహసీల్దార్‌కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల పరిశీలన తర్వాత, స్థానిక ఎస్‌హెచ్‌ఓ ద్వారా అనుమతి ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు నుండి బహిరంగ సభలు నిర్వహించడం, ఊరేగింపులు చేయడం పూర్తిగా నిషిద్ధం అని ఆయన స్పష్టం చేశారు. అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు, రోడ్ షోలలో లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుండి రాత్రి పది గంటల మధ్య మాత్రమే ఉపయోగించాలని నిబంధన విధించారు. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, పోలీస్ అధికారులు లౌడ్ స్పీకర్‌లను జప్తు చేయడానికి అధికారం కలిగి ఉంటారని పేర్కొన్నారు.
Also Read: Collector Rahul Raj: బాల్యవివాహాలపై మెదక్ జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
వాహనాలపై నిబంధనలు
ఎన్నికల ప్రచారానికి వాహనాల వినియోగంపై కలెక్టర్ రాహుల్ రాజ్ కీలక వివరణ ఇచ్చారు. సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు గ్రామపంచాయతీ పరిధిలో తమ ప్రచారం కోసం ఒక వాహనాన్ని ఉపయోగించడానికి అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే, ఈ వాహనాల వివరాలను సంబంధిత తహసీల్దార్లకు ముందుగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. వార్డు సభ్యుల అభ్యర్థులు మాత్రం తమ ప్రచారం కోసం ఎలాంటి వాహనాన్ని ఉపయోగించడానికి అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. వార్డు విస్తీర్ణం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నియంత్రణ విధించినట్లు వివరించారు.
వాహన పర్మిట్ తప్పనిసరి
పోలింగ్ రోజున కూడా గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఒక వాహనాన్ని ఉపయోగించేందుకు మాత్రమే అనుమతి ఇస్తారు. పోలింగ్ రోజున ఇతర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. వార్డు మెంబర్ అభ్యర్థులకు పోలింగ్ రోజున కూడా వాహన అనుమతి ఉండదని కలెక్టర్ తేల్చి చెప్పారు. సంబంధిత తహసీల్దార్లు నిర్ణీత నమూనాలో గ్రామపంచాయతీ సర్పంచ్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు మాత్రమే వాహన పర్మిట్లను జారీ చేస్తారు. అభ్యర్థులు ఆ వాహన పర్మిట్ యొక్క అసలు ప్రతిని వాహనం ముందు వైపు అద్దంపై తప్పనిసరిగా అతికించాల్సి ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
Also Read: Medak District: పౌష్టికాహారం రాజకీయ పథకం కాదు.. రాజ్యాంగ హక్కు: శ్రీనివాస్ రెడ్డి
